రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
విజయవాడ : మహోన్నతమైన రాజ్యాంగాన్ని రచించి దేశ ప్రజలకు దశ దిశ నిర్దేశించిన
బాబా సాహెబ్ అంబేద్కర్ చిరస్మణీయులని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్
చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. డాక్టర్ భీమ్రావ్
అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని వాంబేకాలనీ హెచ్ బ్లాక్ నందు ఆ మహనీయుని
చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత
బాబా సాహెబ్ అంబేద్కర్ దేశానికి అందించిన సేవలను స్మరించుకున్నారు. అనంతరం
మీడియాతో మాట్లాడారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం బిఆర్ అంబేద్కర్ ఎంతో
కృషి చేశారని, సమసమాజాన్ని నిర్మించడానికి జీవితకాలం కష్టపడ్డారని మల్లాది
విష్ణు అన్నారు. న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా, సామాజిక సంస్కర్తగా బాబా సాహెబ్
భారతీయుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతారని వ్యాఖ్యానించారు. రాజ్యాంగమంటే
కేవలం ప్రభుత్వ విధివిధానాలు, శాసనసభల రూపకల్పనే కాదని.. కోట్లాది పీడిత ప్రజల
ఆశయాలను ప్రతిబింభించాలన్నది ఆయన ప్రధాన ఆశయమన్నారు. అంబేద్కర్ ఆశయాలు,
ఆలోచనలకు ఆచరణ రూపం ఇస్తూ కులమతాలు, పార్టీలకతీతంగా సీఎం జగన్మోహన్ రెడ్డి
సంక్షేమ పథకాలు అందిస్తున్నారని మల్లాది విష్ణు అన్నారు. విద్యా, వైద్యానికి
పెద్ద పీట వేసి ఆ మహనీయుని ఆకాంక్షలను నెరవేరుస్తున్నారని పేర్కొన్నారు.
అంబేద్కర్ స్ఫూర్తితో సమ సమాజ స్థాపన కోసం, అణగారిన వర్గాల అభివృద్ధికి
అహర్నిశలు శ్రమిస్తూ ప్రజల హక్కులను రాజ్యాంగపరంగా కాపాడుతున్నారన్నారు. అందరూ
అంబేద్కర్ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని అద్భుత సమాజ నిర్మాణం కోసం పాటు
పడాలని మల్లాది విష్ణు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్
ఉమ్మడి రమాదేవి వెంకట్రావు, డివిజన్ కోఆర్డినేటర్ నాలం బాబు, నాయకులు ఆర్.ఎస్.
నాయుడు, నాగమణి, విన్నకోట వెంకటేశ్వరరావు, సీహెచ్ సుబ్బారావు, నీలాపు
దుర్గాప్రసాద్ రెడ్డి, మీసాల సత్యనారాయణ, బాల నాగమ్మ, పద్మావతి, కళ్యాణి,
రాజ్యలక్ష్మి, పార్టీ శ్రేణులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.