ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్
విజయవాడ : మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఇంధనశాఖలో కూడా మార్పులు జరగాలని
రాష్ట్రంలో అనేక విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ఇంధనశాఖ
ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ తెలిపారు. రాష్ట్రంలో స్మార్ట్
మీటర్లు ఏర్పాటు చేయడంపై ఇంధన శాఖకు ఎలాంటి అభ్యంతరం లేదని, పూర్తిగా
ఆహ్వానిస్తోందన్నారు. విజయవాడలో గుణదలలోని విద్యుత్ సౌధలో సోమవారం మీడియా
ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
2019 లోనే అన్ని మీటర్లను స్మార్ట్ మీటర్లుగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం
నిర్ణయం తీసుకుందని, వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు పెట్టాలని 2020లో
రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిందన్నారు. రాష్ట్రంలో దాదాపు 18 లక్షల 57
వేల వ్యవసాయ కనెక్షన్లను స్మార్ట్ మీటర్లుగా పెట్టాలని నిర్ణయం
తీసుకుందన్నారు. ఆర్.డీఎస్ఎస్ ద్వారా 60% గ్రాంట్ ఇచ్చేందుకు కేంద్రం
అంగీకరించిందని ఆయన తెలిపారు. మొదటి ఫేజులో 27 లక్షల 68 వేల మీటర్లు స్మార్ట్
మీటర్లు బిగిస్తున్నామని వాటిలో ఫీడర్లకు 3 లక్షల 7వేల కనెక్షన్లు , ప్రభుత్వ
కార్యాలయాలకు దాదాపు 3లక్షల 22 వేల కనెక్షన్లు, పరిశ్రమలకు ఒక లక్షా 19 వేల
500 కనెక్షన్లు , కమర్షియల్ కనెక్షన్లు 15లక్షల 47 వేలు ఉన్నాయన్నారు.
గృహావసరాల కోసం కేవలం 4 లక్షల 72 వేల కనెక్షన్లు మాత్రమే ఉన్నాయని తెలిపారు.
అమృత్ సిటీలలోను, జిల్లా హెడ్ క్వార్టర్స్ లోను, 200 యూనిట్లు దాటిన 4.72
లక్షల కనెక్షన్స్ కి మాత్రమే స్మార్ట్ మీటర్లు బిగిస్తామని స్పష్టం చేశారు.
రాష్ట్రం మొత్తంగా ఒక కోటి 89 లక్షల వినియోగదారులు ఉన్నారని తెలిపారు. మొత్తం
1.89 కోట్ల కనెక్షన్లకి స్మార్ట్ మీటర్లు బిగించడానికి టెండర్లు పిలిచారని
జరుగుతున్న ప్రచారం పూర్తి అవాస్తవని, దీనిని ఇంధనశాఖ ఖండిస్తుందని ఆయన
తెలిపారు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, అస్సాం, నాగాలాండ్, గుజరాత్ తదితర 15
రాష్ట్రాలు స్మార్ట్ మీటర్లకి టెండర్లు పిలిచాయన్నారు. ఆంధ్రప్రదేశ్ 16వ
రాష్ట్రంగా టెండర్లు పిలుస్తోందన్నారు. 2025 మార్చి నాటికి దేశవ్యాప్తంగా
స్మార్ట్ మీటర్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా
అన్ని రాష్ట్రాలు ముందుకువచ్చాయన్నారు. ఇందులో భాగంగా డిసెంబర్ 2022 నాటికి
ఫీడర్లు, డిసెంబర్ 2025 నాటికి వినియోగదారులకు స్మార్ట్ మీటర్లు బిగించాలని
ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో
ఏపీసీపీడీసీఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ జె. పద్మజనార్థన రెడ్డి,
ఏపీ ట్రాన్స్ కో సీఎండీ, బి. శ్రీధర్, ఏపీ ట్రాన్స్ కో జాయింట్ మేనేజింగ్
డైరెక్టర్ ఐ. ఫృధ్వి తేజ్, సి.ఈ.ఓ. ఏ. చంద్ర శేఖర్ రెడ్డి పాల్గొన్నారు.