ఉత్కంఠపోరులో టీమిండియాదే విజయం
న్యూజిలాండ్ తో లక్నోలో టీ20 మ్యాచ్
6 వికెట్ల తేడాతో నెగ్గిన భారత్
100 పరుగుల లక్ష్యాన్ని 19.5 ఓవర్లలో ఛేదించిన వైనం
రాణించిన సూర్యకుమార్, హార్దిక్
లక్నోలో న్యూజిలాండ్ పై సాధించాల్సింది 100 పరుగులే అయినా గెలిచేందుకు టీమిండియా చాలా కష్టపడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్ లో టీమిండియా 19.5 ఓవర్లలో 4 వికెట్లకు 101 పరుగులు చేసిన భారత్ ఎట్టకేలకు గెలుపుతీరాలకు చేరింది. సూర్యకుమార్ యాదవ్ విన్నింగ్ షాట్ గా బౌండరీ కొట్టడంతో విజయం ఖరారైంది. సూర్యకుమార్ యాదవ్ 26 పరుగులతో, కెప్టెన్ హార్దిక్ పాండ్యా 15 పరుగులతో అజేయంగా నిలిచారు. గిల్ 11, ఇషాన్ కిషన్ 19, రాహుల్ త్రిపాఠి 13, వాషింగ్టన్ సుందర్ 10 పరుగులు చేశారు. కివీస్ బౌలర్లలో మైకేల్ బ్రేస్వెల్ 1, ఇష్ సోధీ 1 వికెట్ తీశారు. కిషన్, సుందర్ రనౌట్ రూపంలో వెనుదిరిగారు. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 99 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ మ్యాచ్ లో విజయంతో మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ ను టీమిండియా 1-1తో సమం చేసింది. ఇరుజట్ల మధ్య సిరీస్ ఫలితాన్ని తేల్చే చివరిదైన మూడో టీ20 మ్యాచ్ ఫిబ్రవరి 1న అహ్మదాబాద్ లో జరగనుంది. ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంగా పేరుగాంచిన నరేంద్ర మోదీ స్టేడియం ఈ మ్యాచ్ కు వేదికగా నిలవనుంది.