హైదరాబాద్ : వచ్చే తెలంగాణాకు హరిత హారం కార్యక్రమంలో నీటిపారుదల శాఖ కు
చెందిన అనువైన భూములు గుర్తించి వాటిలో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని రాష్ట్ర
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశించారు. హరిత హారం, పల్లె
ప్రగతి, కంటి వెలుగు, ఆరోగ్య మహిళ, వేసవిలో అగ్నిప్రమాదాల నివారణ, పదవతరగతి
పరీక్షల నిర్వహణ, ఇళ్ల స్థలాల సేకరణ తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో సి.ఎస్
నేడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా సి.ఎస్ శాంతి
కుమారి మాట్లాడుతూ, రాష్ట్రంలోని అనువైన స్థలాల్లో హరిత హారం క్రింద పెద్ద
ఎత్తున మొక్కలు నాటడం జరిగిందని, త్వరలోనే ప్రారంభం కానున్న 2023 -24 హరిత
హారంలో ఆయా జిల్లాలోని నీటిపారుదల ప్రాజెక్టుల కింద ఉన్న అనువైన స్థలాలను
గుర్తించాలని తెలిపారు. బృహత ప్రకృతి వనాలకు అవసరమైతే అటవీ భూముల పై ప్రణాళిక
తయారు చేయాలని. ఏప్రిల్ మాసాంతం వరకల్లా హరిత హారం కార్యాచరణ ప్రణాళికను
సిద్ధం చేయాలని కలెక్టర్లకు సూచించారు. ప్రస్తుత వేసవి కాలంలో ప్రజలు
అగ్నిప్రమాదాల బారినపడకుండా తగు ముందు జాగ్రత్తలు చేపట్టాలని కలెక్టర్లను
కోరారు. అగ్నిప్రమాదాల నివారణ కేవలం అగ్నిమాపక శాఖపైనే వదలకుండా అన్ని
ప్రభుత్వ విభాగాలను, ప్రజలను భాగస్వామ్యం చేయాలని అన్నారు. ఇటీవల హైదరాబాద్ లో
జరిగిన రెండు అగ్నిప్రమాదాలు ప్రస్తావిస్తూ, అగ్నిప్రమాదాలు జరిగితే వెంటనే
చేపట్టాల్సిన ముందు జాగ్రత చర్యలపై ప్రజలను చైతన్యపర్చాలని తెలియచేసారు.
అగ్నిప్రమాదాలు జరిగే అవకాశమున్న వాటిపై ఫైర్ సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని
సి.ఎస్ కోరారు. ఏప్రిల్ 4 వ తేదీ నుండి 13 తేదీ వరకు జరుగనున్న పదవ తరగతి
పరీక్షలకు 4.94 లక్షల మంది విద్యార్థులు హాజరవుతున్నారని, ఈ పరీక్షల నిర్వహణలో
పకడ్బందీ ఏర్పాట్లను చేయాలని ఆదేశించారు. ఉదయం 9.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ
పరీక్షలకు గతంలో మాదిరిగా 11 పేపర్లు కాకుండా ఈ సారి కేవలం ఆరు పేపర్లు
మాత్రమే ఉంటాయని తెలిపారు. పరీక్షలను సక్రమంగా నిర్వహించడంలో పోలీస్ శాఖ
తోపాటు ఇతర శాఖలతో సమన్వయంతో పనిచేయాలని అన్నారు.కంటి వెలుగు కార్యక్రమంలో
భాగంగా ఇప్పటి వరకు 86.50 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించి, 14.23 లక్షల
మందికి రీడింగ్ గ్లాసెస్ పంపిణి చేశామని చెప్పారు. 10.73 లక్షల మందికి
ప్రిస్క్రిప్షన్ అద్దాల పంపిణి కొనసాగుతోందని అన్నారు. అదేవిధంగా. అంతర్జాతీయ
మహిళా దినోత్సవం సందర్బంగా ప్రారంబించిన ఆరోగ్య మహిళ కార్యక్రమానికి మంచి
స్పందన వస్తోందని అన్నారు జిల్లాలోని కంటి వెలుగు, ఆరోగ్య మహిళ శిబిరాలను
కలెక్టర్లు సందర్శించి ఉత్తమ సేవలందే విధంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్లను
ఆదేశించారు. నిరుపేదలకు లబ్ది కలిగే 58 , 59 ,76 ,118 జీవో లపై కలెక్టర్లు
ప్రత్యేక దృష్టి సారించి పట్టాలపంపిణీ, క్రమబద్దీకరణకై నిర్దేశించిన మొత్తాలను
చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు.