చంద్రబాబు పర్యటన సందర్భంగా అంగళ్లు, పుంగనూరులో హింస
పుంగనూరు బైపాస్ లో చంద్రబాబు వెళ్తారని తొలుత సమాచారం ఇచ్చారన్న పెద్దిరెడ్డి
ఆ తర్వాత రెచ్చగొట్టేందుకు పుంగనూరులోకి వచ్చారని మండిపాటు
పుంగనూరు : నిన్న ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని అంగళ్లు, పుంగనూరులో జరిగిన
హింసకు టీడీపీ అధినేత చంద్రబాబే కారకుడని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
అన్నారు. పక్కా స్కెచ్ తోనే టీడీపీ నేతలు, కార్యకర్తలతో దాడులు చేయించాడని
ఆరోపించారు. పుంగనూరు పట్టణానికి చంద్రబాబు రావడం లేదని, బైపాస్ లో వెళ్తారని
తొలుత సమాచారం అందించారని, పోలీసులకు కూడా ఇదే విషయం చెప్పారని అన్నారు. ఆ
తర్వాత పుంగనూరులోకి వచ్చారని విమర్శించారు. వాస్తవానికి టీడీపీ పాలనలో తమకు
జరిగిన అన్యాయం పట్ల నిరసన తెలిపేందుకు వైసీపీ కార్యకర్తలు ఉదయం 10.30 గంటల
నుంచి ఎదురు చూశారని, ఆయన ఇటువైపు రావడం లేదని వారంతా వెళ్లి పోయారని
చెప్పారు. ఆ తర్వాత రెచ్చగొట్టడానికి చంద్రబాబు పుంగనూరు లోపలకు వచ్చారని
దుయ్యబట్టారు. సమస్యలు ఉత్పన్నం కాకూడదనే చంద్రబాబు వాహనాన్ని పోలీసులు
అడ్డుకున్నారని చెప్పారు. ఈ వయసులో ఇలాంటి దుర్మార్గమైన పనులను చంద్రబాబు
చేయిస్తాడని ఎవరూ అనుకోరని అన్నారు. దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు
తీసుకుంటామని చెప్పారు.