‘ది కశ్మీర్ ఫైల్స్’ చిత్రంపై ‘ఇఫి’ జ్యూరీ హెడ్, ఇజ్రాయెల్ దర్శకుడు నడవ్
లాపిడ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. లాపిడ్ వ్యాఖ్యలను
భారత్‌లోని ఇజ్రాయెల్ రాయబారి నావొర్ గిలాన్ సైతం ఖండించారు. ఈ క్రమంలోనే
తనకు ట్విటర్ వేదికగా ద్వేషపూరిత సందేశాలు వస్తున్నాయని గిలాన్ తెలిపారు.
ఇటీవల ‘ది కశ్మీర్ ఫైల్స్ చిత్రంపై ‘ఇఫి’ జ్యూరీ హెడ్, ఇజ్రాయెల్
దర్శకుడు నడవ్ లాపిడ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ
సినిమాను ప్రచారం కోసం తీసిన అసభ్యకర చిత్రంగా పేర్కొన్నారు. దీంతో
దేశవ్యాప్తంగా ఆయనపై ఆగ్రహం వ్యక్తమైంది. లాపిడ్ వ్యాఖ్యలను భారత్‌లోని
ఇజ్రాయెల్ రాయబారి నావొర్ గిలాన్ ఖండించారు. భారత ప్రభుత్వానికి ఆయన
క్షమాపణలు కూడా తెలిపారు. ఈ క్రమంలోనే తనకు ట్విటర్ వేదికగా విద్వేషపూరిత
సందేశాలు వస్తున్నాయని గిలాన్ తెలిపారు. ఈ మేరకు ఓ వ్యక్తి పంపిన మెసేజ్
స్క్రీన్‌షాట్‌ను ట్విటర్ వేదికగా పోస్ట్ చేశారు. ‘మీలాంటి వ్యక్తులను అంతం
చేసిన హిట్లర్ గొప్పవాడు. వెంటనే భారత్‌నుంచి వెళ్లిపోండి. హిట్లర్ గొప్ప
వ్యక్తి’ అని అందులో రాసి ఉంది. పీహెచ్డీ చేసిన ఓ వ్యక్తి ఈ మెసేజ్‌ను
పంపినట్లు తెలుస్తోందని చెబుతూ అతని వివరాలు గోప్యంగా ఉంచారు. ఈ క్రమంలోనే
పలువురు గిలాన్‌కు మద్దతుగా నిలిచారు. అనంతరం ఆయన మరో ట్వీట్ చేస్తూ ‘ఇంకా
కొందరిలో జాతివివక్ష భావాలు ఉన్నాయని ఈ పోస్ట్ ద్వారా గుర్తుచేయాలనుకున్నా.
మనమంతా కలిసికట్టుగా దీన్ని వ్యతిరేకించాలని పేర్కొన్నారు. రెండో ప్రపంచ యుద్ధ
సమయంలో జర్మనీ నియంత హిట్లర్ నేతృత్వంలోని నాజీలు.. లక్షలాది యూదులను ఊచకోత
కోసిన విషయం తెలిసిందే. ఇజ్రాయెల్- భారత్ సంబంధాలు పటిష్ఠమైనవని పలువురు
నెటిజన్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ‘ది కశ్మీర్ ఫైల్స్’పై
తాను చేసిన వ్యాఖ్యలతో బాధపడిన వారికి లాపిడ్ సైతం ఇటీవల క్షమాపణలు చెప్పారు.
తానెప్పుడూ ఎవరినీ అవమానించాలనుకోనని, అది తన ఉద్దేశం కాదని అన్నారు.