40 స్థానాలతో కాంగ్రెస్ విజయం
సుఖ్విందర్ వైపు మొగ్గు చూపిన కాంగ్రెస్ అధిష్ఠానం
డిప్యూటీ సీఎంగా ముఖేశ్ అగ్నిహోత్రి
సుఖ్విందర్ సింగ్ సుఖు హిమాచల్ ప్రదేశ్ నూతన సీఎంగా బాధ్యతలు అందుకోనున్నారు.
ఇటీవల జరిగిన హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 40
స్థానాలతో విజయం సాధించింది. సీఎంగా సుఖ్విందర్ సింగ్ సుఖు, డిప్యూటీ సీఎంగా
ముఖేశ్ అగ్నిహోత్రి వ్యవహరించనున్నారని చత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి, హిమాచల్
ప్రదేశ్ కాంగ్రెస్ పరిశీలకుడు భూపేశ్ భగేల్ వెల్లడించారు. కాంగ్రెస్
లెజిస్లేచర్ పార్టీ సమావేశం ముగిసిన అనంతరం ఆయన ఈ మేరకు ప్రకటన చేశారు.
ముఖ్యమంత్రిగా సుఖ్విందర్ సింగ్ నియామకానికి అధిష్ఠానం ఆమోదం తెలిపిందని
వివరించారు. సీఎం పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమం రేపు (డిసెంబరు 11) ఉదయం 11
గంటలకు జరగనుందని భగేల్ తెలిపారు. కాగా, హిమాచల్ ప్రదేశ్ సీఎం రేసులో పీసీసీ
చీఫ్ ప్రతిభా సింగ్ పేరు బలంగా వినిపించినా, పార్టీ అధిష్ఠానం సుఖ్విందర్
సింగ్ వైపే మొగ్గుచూపింది. సుఖ్విందర్ సింగ్ సుఖు నాదౌన్ అసెంబ్లీ నియోజకవర్గం
నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలో హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ గా
పనిచేశారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సుఖ్విందర్ కాంగ్రెస్ అగ్రనేత
రాహుల్ గాంధీకి సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. ఆయన కాంగ్రెస్ పార్టీ
విద్యార్థి విభాగం ఎన్ఎస్ యూఐ నుంచి అంచెలంచెలుగా ఎదిగారు.