‘సినిమా’ను మించిన ట్విస్టులు
వెండితెరపై మక్కువ పెంచుకున్న సీఐ స్వర్ణలత
అవకాశాల కోసం వైసీపీ నేతలతో సాన్నిహిత్యం
బెదిరించి డబ్బులు గుంజిన ఘటనతో కలకలం
విశాఖపట్నం : బాధ్యత గల విధుల్లో ఉండి నోట్ల మార్పిడి కేసులో కొందరు
వ్యక్తులను బెదిరించి లక్షల్లో డబ్బులు గుంజిన కేసులో ఆర్మ్డ్ రిజర్వు
ఇన్స్పెక్టర్ స్వర్ణలత అరెస్టవడం పోలీసు శాఖలో సంచలనంగా మారింది. ‘ఏపీ 31’..
ఇదేదో రిజిస్ట్రేషన్ నంబరు కాదు. విశాఖకు చెందిన ఓ మహిళా రిజర్వు
ఇన్స్పెక్టర్ నటిస్తున్న చిత్రం పేరు. ప్రస్తుతం ఆమెపై ఐపీసీలోని పలు
సెక్షన్ల కింద కేసు నమోదైంది. బాధ్యత గల విధుల్లో ఉండి నోట్ల మార్పిడి కేసులో
కొందరు వ్యక్తులను బెదిరించి లక్షల్లో డబ్బులు గుంజిన కేసులో ఆర్మ్డ్
రిజర్వు ఇన్స్పెక్టర్ స్వర్ణలత అరెస్టవడం పోలీసు శాఖలో సంచలనంగా మారింది.
ఏఆర్ హోంగార్డు ఎస్సైగా పనిచేస్తున్నప్పుడే హోంగార్డు నియామకాల విషయంలో ఆమెపై
అనేక ఆరోపణలొచ్చాయి. తర్వాత విజయవాడ బదిలీ చేయగా, కొంత కాలం పనిచేసి
శ్రీకాకుళం ఏఆర్‌కు వచ్చారు. అక్కడ పనిచేస్తుండగా జిల్లాల విభజన జరగడంతో
బదిలీపై అనకాపల్లి జిల్లాకు వెళ్లారు. విశాఖలో ఖాళీ ఉండటంతో వైసీపీ నేతల
సిఫార్సులతో నగరానికి వచ్చారు. కొంతకాలం సిటీ ట్రైనింగ్ సెంటర్లో పనిచేసి
తర్వాత హోంగార్డుల రిజర్వు ఇన్స్పెక్టర్ (ఆర్ఐ)గా బాధ్యతలు చేపట్టారు.
హోంగార్డుల నిర్వహణ విషయంలోనూ స్వర్ణలత అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు.
నృత్యాలతో సామాజిక మాధ్యమాల్లో హల్చల్ : సినిమాలపై ఆసక్తి ఉన్న స్వర్ణలత
కొంత కాలం క్రితం ఓ పాటకు డ్యాన్స్ చేసి చిరు ప్రయత్నం అంటూ ఆ వీడియోతో
సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేశారు. ఒక ప్రజాప్రతినిధి తాను తీయబోయే
సినిమాలో మంచి పాత్ర ఇస్తానని, ఇందుకు నృత్యంలో ప్రావీణ్యం ఉండాలని చెప్పటంతో
ఒక కొరియోగ్రాఫర్‌ను నియమించుకుని సాధన చేస్తున్నారు. ఇందులో భాగంగానే పలు
వీడియోలు తీశారు.
కేసు నుంచి తప్పించే స్థాయిలో పలుకుబడి : సినిమాల్లో అవకాశాలకు
ప్రయత్నిస్తున్న క్రమంలో స్వర్ణలతకు వైసీపీ నేతలతో పరిచయాలు పెరిగాయి. గత
జీవీఎంసీ ఎన్నికల్లో ఆమెకు బంధువైన ఓ మహిళా అభ్యర్థి తరఫున ప్రచారంలో
పాల్గొన్నట్లుగా ఆరోపణలు వచ్చాయి. కొన్నాళ్ల కిందట టీడీపీ సీనియర్ నేత, మాజీ
మంత్రి అయ్యన్నపాత్రుడిపై ఏపీ పోలీసు అధికారుల సంఘ ఉపాధ్యక్షురాలి హోదాలో
పంచ్ డైలాగ్స్‌తో విరుచుకుపడ్డారు. పోలీసులకు రాజకీయాలు ముడిపెట్టి
మాట్లాడుతున్నారంటూ ప్రెస్మీట్లో అయ్యన్నపై ఓ స్క్రిప్ట్ రాసుకువచ్చి చదివి
వినిపించారు. ఇదంతా వైసీపీ నేతల సూచనలతో జరిగిందని ప్రచారం సాగింది. తాజాగా
నోట్ల మార్పిడి కేసులో పోలీసులు అరెస్టు చేయగా స్వర్ణలతపై కేసు పెట్టకుండా
ఆమెకు సన్నిహితుడైన ఓ కీలక ప్రజాప్రతినిధి విశ్వప్రయత్నాలు చేశారు. తన వల్ల
కాదని తేలడంతో ఆయన వైసీపీ ముఖ్య నేతలను అభ్యర్థించి ఆమెపై కేసు తీవ్రతను
తగ్గించేలా ఒత్తిళ్లు తెచ్చారంటే స్వర్ణలత రాజకీయ సంబంధాలు ఏ స్థాయిలో
ఉన్నాయో అర్థమవుతుందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
సినిమాల కోసమేనా? : ప్రస్తుతం తాను నటిస్తున్న ‘ఏపీ 31’ చిత్ర నిర్మాణ
వ్యవహారాల పర్యవేక్షణలోనూ స్వర్ణలత భాగస్వామి అయినట్లు సమాచారం. అందుకు డబ్బుల
నిమిత్తమే నోట్ల మార్పిడిలో కీలకంగా వ్యవహరించారా? అన్న ప్రశ్నలు
తలెత్తుతున్నాయి. కొందరు రియల్టర్లతోనూ ఆమెకు పరిచయాలున్నాయి. కమీషన్
తీసుకుని ఇలా నోట్లు మార్పిడి చేసుకోవాలని చూసేవారికి కొన్ని ప్లాట్లు కూడా
ఆమె బుక్ చేశారన్న ఆరోపణలున్నాయి.