వెలగపూడి :75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని శుక్రవారం నేలపాడులోని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిగా పాల్గొన్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ మువ్వన్నెల జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1950 జనవరి 26 మన దేశం సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా ప్రకటించబడి 75 వసంతాలు పూర్తి చేసుకున్న గొప్ప శుభదినమని ఈసందర్భంగా ముందుగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. భారత న్యాయ వ్యవస్థ ప్రజాస్వామ్య విశ్వాసానికి మూలస్థంభంగా నిలుస్తోందని పేర్కొన్నారు. అంతే గాక రాజ్యాంగంలో పేర్కొన్న ప్రాధమిక హక్కులన్నీటినీ రూల్ ఆఫ్ లా పరిరక్షిస్తోందని జస్టిస్ ఠాకూర్ గుర్తు చేశారు. రాజ్యాంగం ద్వారా అందించిన హక్కుల్లో అతి ముఖ్యమైనది ఓటు హక్కు అని దాని ద్వారా కోట్లాది మంది ప్రజలు వారికి నచ్చిన వ్యక్తిని నేతగా ఎన్నుకోవడం జరగుతోందని చెప్పారు. అంతేగాక విద్యా హక్కు,కనీస వేతన హక్కు వంటి వివిధ రకాల హక్కలు రాజ్యాంగం కల్పించడంతో ప్రజలకు అన్ని రకాల ప్రయోజనాలు కలుగుతున్నాయని పేర్కొన్నారు. దేశంలో క్షేత్రస్థాయి వరకూ గ్రామ పంచాయితీల వ్యవస్థను ఏర్పాటు చేయడంతో నేడు ప్రజాస్వామ్య వ్యవస్థ విజయవంతంగా అమలవుతోందని చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ పేర్కొన్నారు. రాజ్యాంగ నిర్మాత డా.బిఆర్ అంబేద్కర్ మనకు అందించిన రాజ్యాంగం నేడు ఒక లివింగ్ డాక్యుమెంట్ గా ఉందని రాజ్యాంగ గొప్పదనాన్నిప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ కొనియాడారు. నేడు అనేక సవాళ్ల మధ్య మనం జీవిస్తున్నామని అయినప్పటికీ వాటన్నిటినీ అధికమించేందుకు మన రాజ్యాంగం మనకు అన్నివిధాలా తగిన శక్తిని,స్తూర్తిని అందిస్తోందని పేర్కొన్నారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని కలిగిన మన దేశంలో నెలకొన్న అసమానతలను రూపు మాపేందుకు అన్నివిధాలా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. రాష్ట్రంలో లీగల్ సర్వీసెస్ అధారిటీ ద్వారా 8వేల 960 లీగల్ లిటరసీ అవగాహనా శిబిరాలు నిర్వహించడం ద్వారా పెద్దఎత్తున ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయడం ఆనందదాయకమని చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళలు, చిన్నారులు, కార్మిక వర్గాలకు చెందిన వివాదాలను సకాలంలో పరిష్కరించేందుకు ఈ శిబిరాలు ఎంతగానో దోహదపడ్డాయని చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో హైకోర్టు అడ్వకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్, హైకోర్టు బార్ కౌన్సిల్ అధ్యక్షులు ఘంటా రామారావు,హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ అధ్యక్షులు జానకిరామి రెడ్డి తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పలువురు హైకోర్టు న్యాయమూర్తులు వారి కుటుంబ సభ్యులు,పిపి నాగిరెడ్డి,పలువురు రిజిష్ట్రార్లు,సీనియర్ న్యాయవాదులు,బార్ అసోసియేషన్,బార్ కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం హైకోర్టు ప్రాంగణంలో చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ సహా ఇతర న్యాయమూర్తులు మొక్కలు నాటారు.