న్యూఢిల్లీ : హై టెక్నాలజీ రంగాలకు సంబంధించిన ఏడు రంగాల్లో భాగస్వామ్యం కోసం
భారత్, అమెరికాలు ఒక మార్గసూచీని ఆవిష్కరించాయి. జాతీయ భద్రతా సలహాదారు
అజిత్ డోభాల్, ఇక్కడ పర్యటిస్తున్న అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్
సలీవాన్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. దీనికింద సెమీ కండక్టర్లు,
కొత్త తరం టెలికమ్యూనికేషన్, కృత్రిమ మేధ (ఏఐ), రక్షణ రంగాల్లో రెండు దేశాలు
సహకరించుకుంటాయి. భారత ప్రధాని నరేంద్ర మోడీ త్వరలో అమెరికాలో
పర్యటించనున్నారని, ఆ సందర్భంగా అనేక ద్వైపాక్షిక అంశాల్లో పురోగతి
సాధించేందుకు కసరత్తు చేస్తున్నామని జేక్ పేర్కొన్నారు. రక్షణ, హైటెక్,
వాణిజ్యం, విద్యార్థుల పరస్పర పర్యటనలు వంటి అంశాల్లో అవరోధాలను తొలగించడం
వీటి ఉద్దేశమని చెప్పారు. ‘ఇనీషియేటివ్ ఆన్ క్రిటికల్ అండ్ ఎమర్జింగ్
టెక్నాలజీస్’ (ఐసెట్)పై సీఐఐ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఈ మార్గసూచీని
డోభాల్, జేక్లు ఆవిష్కరించారు. వ్యూహాత్మక రంగాల్లో సహకారాన్ని మరింత
విస్తరించుకునేందుకు ఐసెట్‌ను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, భారత ప్రధాని
మోడీ గత ఏడాది మే నెలలో ప్రకటించారు. ఇది కీలక అంశాల్లో మైత్రిని మరింత
ముందుకు తీసుకెళుతుందని డోభాల్ తాజాగా పేర్కొన్నారు.
మోడీతో సలీవాన్ భేటీ : ప్రధాని నరేంద్ర మోడీతో అమెరికా జాతీయ భద్రతా సలహాదారు
జేక్ సలీవాన్ ఢిల్లీలో భేటీ అయ్యారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకార
పురోగతిని మోడీకి ఆయన వివరించారు. ‘మీ పర్యటన కోసం బైడెన్ ఆసక్తిగా ఎదురు
చూస్తున్నారు. ఘనంగా స్వాగతం పలికేందుకు ఉత్సుకతతో ఉన్నారని సలీవాన్
వివరించారు. అనంతరం తన అమెరికా పర్యటనలో ఉభయ పక్షాల ప్రయోజనాలను కాపాడే ఫలవంత
చర్చలకు ప్రయత్నిస్తానని ప్రధాని మోదీ ఆయనకు హామీ ఇచ్చారు. రెండు దేశాల మధ్య
అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యంపట్ల నరేంద్ర మోడీ సంతృప్తి వ్యక్తం చేశారు.