హైదరాబాద్ : అద్భుతం ఆవిష్కృతమైంది. హైదరాబాద్ ఘన చరిత్రలో మరో కలికుతురాయి
చేరింది. రాష్ట్ర ప్రభుత్వ అవిరళ కృషితో చిరకాల కల సాకారమైంది. భారత్‌లో
తొలిసారి మన భాగ్యనగరం ఆతిథ్యమిచ్చిన ప్రతిష్ఠాత్మక ఫార్ములా-ఈ ప్రపంచ
చాంపియన్‌షిప్ అట్టహాసంగా ముగిసింది. 11 జట్లకు చెందిన 22 మంది రేసర్లు
హోరాహోరీగా పోరాడిన హైదరాబాద్-ఈ ప్రిలో జాన్ ఎరిక్ వెర్న్ టైటిల్‌తో
తళుక్కుమన్నాడు. ఆఖరి క్షణం వరకు అభిమానులను మునివేళ్లపై నిలబెట్టిన
తుదిపోరులో సహచర రేసర్లను వెనుకకు నెడుతూ జాన్ చిరస్మరణీయ విజయంతో
ఆకట్టుకున్నాడు.
33 ల్యాప్‌ల రేసులో డీఎస్ పెన్స్కే రేసర్ జాన్ తనదైన జోరు ప్రదర్శించాడు.
ఫార్ములా-ఈ పోటీలకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కేటీఆర్ విజేత జాన్‌కు
ట్రోఫీ అందించారు. 25వేల మంది అభిమానులు తరలివచ్చిన వేళ హుసేన్సాగర్ తీర
ప్రాంతం కొత్త కళ సంతరించుకుంది. సినీతారలు, క్రికెటర్లు, ప్రముఖుల
తళుకుబెళుకులు హైదరాబాద్ ఫార్ములా-ఈ రేసింగ్‌కు ఎక్కడలేని వన్నె తెచ్చాయి.
మొత్తంగా ‘హ్యాపెనింగ్ హైదరాబాద్’లో మరో అంతర్జాతీయ ఈవెంట్ అభిమానుల మదిలో
చిరకాలం గుర్తుండి పోవడం ఖాయం.
హోరాహోరీగా ఫైనల్ పోరు
టైటిల్ దక్కించుకోవాలన్న కసితో రేసర్లందరూ ఫైనల్ పోరులోకి దిగారు. మధ్యాహ్నం
3.00 గంటలకు మొదలైన రేసు దాదాపు గంట సేపు కొనసాగింది. షెడ్యూల్ ప్రకారం
మొత్తం 32 ల్యాపుల్లో రేసు జరుగాల్సి ఉన్నా..ఆఖర్లో ఒకింత అవాంతరం చోటు
చేసుకోవడంతో మరో ల్యాప్‌ను అదనంగా చేర్చారు. రేసు ఇలా మొదలైందో లేదో కార్లు
ఒక్కసారిగా దుమ్ములేపుతూ ట్రాక్‌పై దూసుకెళ్లాయి. రేసు సాఫీగా సాగుతున్న
క్రమంలో 13వ ల్యాప్‌లో మూడో పాయింట్ వద్ద టీసీఎస్ జాగ్వర్ రేసర్ సామ్
బర్డ్ తమ కంపెనీకే చెందిన మిచ్ ఇవాన్స్ కారును ఢీకొట్టాడు. దీంతో
ఒక్కసారిగా ప్రమాదం చోటు చేసుకుంది. ఈ కారణంగా నాలుగు కార్లు తమ గతి తప్పాయి.
వెంటనే తేరుకున్న రేసర్లు అప్పటికప్పుడు పుంజుకుని రేసులోకి దూసుకురాగా,
టీసీఎస్ రేసర్లు పోటీ నుంచి తప్పుకున్నారు. ఇదిలా ఉంటే డీఎస్ పెన్స్కేకు
చెందిన జాన్ ఎరిక్ ల్యాప్ ల్యాప్నకు ప్రత్యర్థులకు సవాలు విసురుతూ ముందుకు
సాగాడు. ఈ క్రమంలో బ్యాటరీని తెలివిగా వినియోగిస్తూ కీలక మలుపుల్లో
ఓవర్టేకింగ్తో ముందంజ వేశాడు. ఆఖరి ల్యాప్ వరకు జాన్, నిక్ మధ్య గెలుపు
దోబూచులాడింది. అయితే కొన్ని సెకన్ల వ్యవధిలో జాన్..చెకర్డ్ ఫ్లాగ్‌ను
దాటుకుంటూ టైటిల్‌ను సొంతం చేసుకోగా, నిక్కు నిరాశే ఎదురైంది. అప్పటి వరకు
మూడో స్థానంలో ఎన్విజన్ రేసింగ్ డ్రైవన్ సెబాస్టియన్ బుమీ ఓవర్‌పవర్
వాడి 17 సెకన్ల పెనాల్టీతో 15వ స్థానానికి పడిపోయాడు. సెబాస్టియన్ డీ
కోస్టాకు మూడో స్థానం దక్కింది. మొత్తంగా సీజన్-7 తర్వాత జీన్‌కు ఇది తొలి
పోడియం ఫినిష్ కావడం విశేషం.