హైదరాబాద్ : నేడు చంద్రగ్రహణం కావడంతో ప్రముఖ ఆలయాలన్నీ మూతపడ్డాయి. దేశంలోని కొన్ని ప్రాంతాలకే పరిమితమైన చంద్రగ్రహణం కొన్ని రాష్ట్రాల్లో సంపూర్ణంగా ఉంటే మరికొన్ని రాష్ట్రాల్లో పాక్షికంగా కనిపిస్తుంది. ఇక హైదరాబాద్‌లోనూ గ్రహణం పాక్షికంగా కనిపిస్తుంది. సాయంత్రం 5.40 గంటలకు ప్రారంభమయ్యే గ్రహణం 46 నిమిషాలపాటు కొనసాగి 7.26 గంటలకు ముగుస్తుందని జీపీ బిర్లా ఆర్కియాలాజికల్ ఆస్ట్రోనామికల్ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (జీపీబీఏఏఎస్ఆర్ఐ) తెలిపింది. చంద్రగ్రహణాన్ని నేరుగా వీక్షించవచ్చని, ఇందుకోసం ఎలాంటి పరికరాలు ఉపయోగించాల్సిన పనిలేదని నిపుణులు చెబుతున్నారు. కాగా, ఈ ఏడాదికి ఇదే చివరి గ్రహణం కావడం గమనార్హం. ఈ చంద్రగ్రహణం ఇటానగర్, గువాహటి, సిలిగురి ప్రాంతాల్లో మాత్రమే పూర్తిగా కనిపిస్తుంది. కోల్‌కతా, భువనేశ్వర్, ఢిల్లీ, శ్రీనగర్, చెన్నై, గాంధీనగర్, ముంబై, హైదరాబాద్‌లో పాక్షికంగా కనిపిస్తుంది.