ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా వ్యభిచారం నిర్వహిస్తున్న18మందిని అదుపులోకి
తీసుకోవడమే కాకుండా, 34 మొబైల్ ఫోన్లు, డ్రగ్స్ ను హైదరాబాద్ పోలీసులు
స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా ఉచ్చులో విదేశాలకు చెందిన మహిళలతో పాటు వివిధ
నగరాలకు చెందిన యువతులు కూడా చిక్కుకున్నారు. మహిళలు, యువతులకు నిర్వాహకులు
ఎండీఎంఏ మాదకద్రవ్యాలు అలవాటు చేయడంతో పాటు, బాధిత మహిళల ద్వారా విటులకు కూడా
వాటిని సరఫరా చేస్తూ మత్తు దందా నిర్వహిస్తున్నట్టు పోలీసుల దర్యాప్తులో
తేలింది. హైదరాబాద్ కు చెందిన అర్నవ్ ఈముఠాకు నాయకుడిగా ఉంటూ దందా
కొనసాగిస్తున్నట్టు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర మంగళవారం
వెల్లడించారు. గుట్టు చప్పుడు కాకుండా వెబ్సైట్లు, వాట్సాప్ గ్రూప్ ద్వారా ఈ
ముఠా కాంటాక్ట్స్ పెట్టుకుని పెద్ద పెద్ద హోటళ్లలో వ్యభిచారం
నిర్వహిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ముఠా ఉచ్చులో ఏకంగా 14,190 మంది
మహిళలు, యువతులు చిక్కుకున్నట్టు సీపీ వివరించారు. వీరంతా ఆంధ్రప్రదేశ్,
తెలంగాణ, దిల్లీ, ముంబయి, కోల్కతా, అస్సాం, బంగ్లాదేశ్, నేపాల్, థాయిలాండ్,
ఉజ్బెకిస్తాన్, రష్యాకు చెందిన వారని వెల్లడించారు. నిందితులు పలు ప్రాంతాల్లో
కాల్సెంటర్లు సైతం ఏర్పాటు చేసినట్టు సీపీ తెలిపారు. నిర్వాహకులు దందా మొత్తం
ఆన్లైన్లోనే నిర్వహిస్తున్నారని, ప్రధాన నిందితుడు అనుమానం రాకుండా తన ఫోటో
కూడా బయటకు పొక్కకుండా జాగ్రత్త పడినట్టు చెప్పారు. ఈముఠాలోని మొత్తం 18
మందిని పోలీసులు అరెస్టు చేశారు. 39 కేసులు నమోదు చేసి నిందితుల వద్ద నుంచి 34
సెల్ ఫోన్లు, 3 కార్లు, ల్యాప్టాప్, 2.5 గ్రాముల ఎండీఎంఏ మాదకద్రవ్యాలు
స్వాధీనం చేసుకున్నారు.