న్యూ ఢిల్లీ : దేశ రాజకీయాలకు ఢిల్లీ నే కేంద్రమని అనుకోవద్దని, తాము
హైదరాబాద్‌లో కూర్చొని కూడా జాతీయస్థాయి రాజకీయాలు చేయగలమని బీఆర్ఎస్
కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తెలిపారు. నరేంద్ర మోడీ, రాహుల్
గాంధీ చుట్టూనే దేశ రాజకీయాలు తిరగాలనే భ్రమల్ని వదులుకోవాలన్నారు. ఢిల్లీ లో
విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన కేటీఆర్ విపక్షాల ఐక్యత కాదని, ప్రజల
ఐక్యత ముఖ్యమని వ్యాఖ్యానించారు. రేవంత్‌రెడ్డిని థర్డ్‌గ్రేడ్ క్రిమినల్‌తో
పోల్చిన ఆయన అవినీతి, కుటుంబ పాలనపై మాట్లాడే హక్కు కాంగ్రెస్‌కు లేదని
దుయ్యబట్టారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో ఇవాళ కేటీఆర్ భేటీకానున్నారు.
విపక్షాల ఐక్యత కాదు..ప్రజల ఐక్యత కోరుకుంటున్నాం
రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై ఢిల్లీ వెళ్లిన మంత్రి కేటీఆర్ రక్షణశాఖ
మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో సమావేశం అనంతరం విలేకరులతో ముచ్చటించారు. ఢిల్లీలో
బీఆర్ఎస్ కార్యాలయాలు ఏర్పాటు చేసినా ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించడం లేదన్న
ప్రశ్నపై స్పందించారు. దేశ రాజకీయాలు ఢిల్లీ కేంద్రంగానే సాగాలని అనుకోవద్దని,
తాము హైదరాబాద్ నుంచే చక్రం తిప్పుతామని తెలిపారు. ఇప్పటివరకు పని చేసిన
ప్రధానమంత్రులందరిలో అత్యంత బలహీనుడు నరేంద్ర మోడీనేనని, ఆయనకు అవకాశం ఇస్తే
ఢిల్లీని కూడా గుజరాత్‌కు తరలిస్తారని వాఖ్యానించారు.
మోడీని దేశంలో అందరికంటే ఎక్కువగా విమర్శించింది బీఆర్ఎస్ అని కేటీఆర్
స్పష్టంచేశారు. దిల్లీ రాష్ట్ర ప్రభుత్వ అధికారాలపై కేంద్రం తెచ్చిన
ఆర్డినెన్సును పార్లమెంట్లో వ్యతిరేకిస్తామని, కాంగ్రెస్ వైఖరేంటో చెప్పాలని
డిమాండ్ చేశారు. పట్నాలో విపక్షాల సమావేశంపై ప్రశ్నించగా ‘విపక్ష పార్టీలను
ఏకం చేసే రాజకీయాలు కాదు. ప్రజలను ఏకం చేసే రాజకీయాలను తాము నమ్ముతామని
చెప్పారు. వాస్తవానికి కాంగ్రెస్, బీజేపీలే కలిసి పనిచేస్తాయన్నారు.
నిజామాబాద్, కరీంనగర్ లోక్‌సభ స్థానాల్లో హస్తం పార్టీ, భారతీయ జనతా పార్టీ
కుమ్మక్కయ్యాయని కేటీఆర్ ఆరోపించారు.