నేడు మరోసారి ఈడీ ముందుకు ఎమ్మెల్సీ కవిత
న్యూ ఢిల్లీ : మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు
సోమవారం 10 గంటల పాటు ప్రశ్నించారు. ఢిల్లీ మద్యం విధానానికి సంబంధించి మొత్తం
14 ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తుండగా.. దానితో తనకు ఎలాంటి సంబంధంలేదని కవిత
స్పష్టం చేసినట్లు సమాచారం. నేడు మళ్లీ విచారణకు రావాలని కవితకు దర్యాప్తు
సంస్థ సూచించింది. ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోమవారం పది గంటలపాటు విచారించింది. ఉదయం 11
నుంచి రాత్రి 9 గంటల వరకు సాగిన విచారణలో అధికారులు ఆమెను 14 ప్రశ్నలు
అడిగినట్లు తెలిసింది. విచారణ ముగిసిన అనంతరం విజయ చిహ్నం చూపుతూ అభిమానులకు
ఎమ్మెల్సీ కవిత అభివాదం చేశారు. ఇవాళ మరోసారి విచారణకు హాజరుకావాలని కవితకు
ఈడీ అధికారులు సూచించారు.
10 గంటలపాటు విచారించిన ఈడీ
ఢిల్లీ మద్యం విధానాన్ని తమకు అనుకూలంగా తయారు చేయించుకొని అనుచిత లబ్ధి
పొందేందుకు సౌత్గ్రూప్ ద్వారా ఆప్ నేతలకు 100 కోట్ల ముడుపులు
చెల్లించారని., ఇండో స్పిరిట్ సంస్థ 192 కోట్ల ప్రయోజనం పొందిందన్న ఆరోపణలపై
మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ దర్యాప్తు కొనసాగిస్తోంది. ఇందులో కవితకు
బినామీగా వ్యవహరించారనే ఆరోపణతో అరుణ్ రామచంద్రపిళ్లైను అరెస్ట్ చేసి 14
రోజులపాటు కస్టడీలోకి తీసుకొని విచారించింది. తర్వాత ఎమ్మెల్సీ కవితను ఈ నెల
11న తొలిసారి 8 గంటల పాటు, నిన్న 10 గంటలపాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్
అధికారులు ప్రశ్నించారు. నిన్న ఈ కేసులో రెండోసారి ఈడీ విచారణకు హాజరైన కవితను
పీఎంఎల్ఏ సెక్షన్ 50 కింద ఈడీ అధికారులు విచారించారు.
మద్యం విధానంతో ఎలాంటి సంబంధం లేదు
సోమవారం విచారణలో ఆమెను ఈ కేసుతో సంబంధం ఉన్న ఇతరులతో కలిపి విచారించారా.?
లేదా? అనేదానిపై స్పష్టత రాలేదు. అయితే పలు విషయాలపై ఆమె నుంచి స్టేట్మెంట్
తీసుకున్నట్లు తెలుస్తోంది. తనకు ఢిల్లీ మద్యం విధానంతో ఎలాంటి సంబంధం లేదని,
ఇది రాజకీయ కుట్ర అని కవిత ఈడీ అధికారులతో అన్నట్లు సమాచారం. తనను
నిందితురాలిగా పిలిచారా ? అని కూడా కవిత అడిగినట్లు తెలిసింది. సోమవారం ఉదయం
11 గంటలకు ఈడీ కార్యాలయానికి చేరుకున్నప్పటికీ, గంట వరకు అధికారులెవ్వరూ
రాలేదని, అప్పటివరకూ గదిలో ఒంటరిగా కూర్చోబెట్టినట్లు సమాచారం. ఈడీ అధికారులు
ప్రశ్నలన్నీ రాజకీయ కోణంలో సంధించినట్లు బీఆర్ఎస్ వర్గాలు పేర్కొన్నాయి.
మరోవైపు ఈడీ తనకు జారీచేసిన సమన్లను కొట్టేయాలని కోరుతూ కవిత సుప్రీంకోర్టులో
దాఖలు చేసిన రిట్ పిటిషన్, ఆ కేసులో తమ వాదనలు వినకుండా ఉత్తర్వులు జారీ
చేయొద్దని కోరుతూ ఈడీ దాఖలు చేసిన కెవియట్లు ఈ నెల 24న విచారణకు రానున్నాయి.