న్యూఢిల్లీ : దేశంలోని కొన్ని ముఖ్యమైన 1000 చిన్న రైల్వే స్టేషన్ల ఆధునికీకరణకు రైల్వేశాఖ సన్నద్ధం అవుతోంది. ‘‘అమృత్ భారత్ స్టేషన్ స్కీం’’ కింద తక్కువ ఖర్చుతోనే అధునిక సౌకర్యాలతో పునర్నిర్మించాలని భావిస్తోంది. దీని కోసం ప్రత్యేక నిధి కేటాయించనున్నారు. ఈ పథకం ప్రకారం.. ఇప్పుడు ఉన్న వాటిని ఆధునికీకరించి, అవసరమైన కొత్త వాటిని చేర్చుతారు. ఇప్పుడున్న భవనాలను పునర్నిర్మించి యాత్రికులకు ఇబ్బందులు కలగకుండా వారి కోసం విస్తారమైన స్థలాన్ని కేటాయిస్తారు. వీలైతే కార్యాలయాలను ఇతర చోటుకు మారుస్తారు. ముఖద్వారాలు, రైల్వే ట్రాకులను నవీకరిస్తారు. వెయిటింగ్ గదుల స్థలాన్ని పెంచుతారు. ప్రణాళికాబద్ధమైన పార్కింగ్, లైటింగ్ సౌకర్యాలు, రోడ్డు విస్తరణ వంటివి ఉంటాయి. అహ్లాదకరమైన అనుభూతి కోసం సంస్కృతి, కళలు ఉట్టిపడేలా స్టేషన్ను తీర్చిదిద్దుతారు.