ఉత్తరాఖండ్ : జోషిమఠ్ శరవేగంగా కుంగుతోంది. తాజాగా ఇస్రో నివేదిక సంచలనం
సృష్టిస్తోంది. కేవలం 12 రోజుల వ్యవధిలోనే ఇక్కడ భూమి భారీగా కుంగిపోయిందని
పేర్కొంది. ఉత్తరాఖండ్ లో పర్యాటక క్షేత్రమైన జోషిమఠ్ కుంగిపోవడం
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఇక్కడ భూమి శరవేగంగా కుంగుతోంది. తాజాగా
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్
సెంటర్ నివేదిక ఇదే విషయాన్ని వెల్లడిస్తోంది. 2022 డిసెంబర్ 27 నుంచి 2023
జనవరి 8వ తేదీ మధ్య ఈ నగరంలో భూమి 5.4 సెంటీమీటర్లు కుంగినట్లు పేర్కొంది.
దీనికి సంబంధించిన ఉపగ్రహ చిత్రాలను కూడా విడుదల చేసింది. గతేడాది
ఏప్రిల్-నవంబర్ మధ్యలో 9 సెంటీమీటర్ల మేరకు కుంగినట్లు గుర్తించారు. 2180
మీటర్ల ఎత్తులో జోషిమఠ్-అవులి రహదారిలో ప్రమాదకర పరిస్థితులు ఏర్పడినట్లు ఈ
ఉపగ్రహచిత్రాల్లో కనిపిస్తున్నట్లు నివేదిక వెల్లడించింది.
ఉత్తరాఖండ్‌లో మరిన్ని ప్రాంతాలు :
టిహరి గఢవాల్: టిహరి జిల్లాలోని అటలి గ్రామం నుంచి రిషికేశ్-కర్ణప్రయాగ్
రైల్వే లైన్ వెళుతుంది. ఇది నరేంద్రనగర్ నియోజకవర్గంలో ఉంది. ఇక్కడ తరచూ
కొండచరియలు విరిగిపడుతున్నాయి. చాలా ఇళ్లు పగుళ్లిచ్చాయి. ఇక్కడ టన్నెల్ పనుల
కోసం పేలుళ్లు చేపట్టడం కూడా సమస్యకు ప్రధాన కారణంగా నిలిచింది. ఇప్పటికే
జిల్లా మేజిస్ట్రేట్ ఈ ప్రాంతాన్ని సందర్శించారు.
పౌరి: ప్రస్తుతం ఇక్కడ నిర్మిస్తున్న రైల్వే ప్రాజెక్టు కారణంగా ఇళ్లకు
పగుళ్లు వస్తున్నాయని ఆరోపిస్తున్నారు. స్థానికంగా ఉన్న శ్రీనగర్‌లోని హెడల్
వీధి, ఆశిష్ విహార్, నర్సరీ రోడ్లో ఈ పరిస్థితి నెలకొంది.
రిషికేశ్-కర్ణప్రయాగ్ రైల్వే లైన్ కోసం చేపట్టే పేలుళ్లే దీనికి కారణమని
చెబుతున్నారు. పేలుళ్లను ఆపి సాధారణంగా పనులు చేసుకోవాలని స్థానికులు
కోరుతున్నారు.
ఉత్తరకాశీ: ఉత్తరకాశీ సమీపంలోని మస్తాది, బట్వాడీ గ్రామాల్లో తరచూ కొండచరియలు
విరిగి పడుతున్నాయి. మస్తాది గ్రామంలోని ఇళ్లు మెల్లగా కుంగుతున్నాయని
స్థానికులు చెబుతున్నారు. ఇక్కడ 1991, 1995, 1996ల్లో భారీగా కొండచరియలు
విరిగిపడ్డాయి. ఇప్పటికీ తరచూ పర్వతాలపై నుంచి రాళ్లు పడుతుంటాయి. ఇక్కడ
భూభాగంలో సర్వేలు నిర్వహిస్తామని జిల్లా డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారి
దేవేంద్ర పట్వాల్ పేర్కొన్నారు. ఈ సర్వే పూర్తయితే గానీ గ్రామస్థులకు
పునరావాసం లభించదు.
రుద్రప్రయాగ్: రిషికేశ్-కర్ణప్రయాగ్ రైల్వే లైన్ సొరంగ నిర్మాణంతో ఇక్కడి
మరోడ గ్రామంలో చాలా ఇళ్లు కూలిపోయే పరిస్థితికి వచ్చాయి. ఈ కుటుంబాలకు ఇప్పటి
వరకు పరిహారం ఇవ్వలేదు. ఇక్కడి నుంచి వీలైనంత త్వరగా గ్రామస్థులను తరలించకపోతే
పెనుప్రమాదం సంభవించే అవకాశం ఉంది.