27 న చలో విజయవాడ…సోమవారం మంత్రుల బృందంతో భేటీ
చర్చల సఫలం కాకుంటెబ్ ప్రత్యక్ష పోరాటమే
ఏపీ జేఏసీ చైర్మన్ బండి శ్రీనివాసరావు, సెక్రటరీ జనరల్ జి. హృదయరాజు
విజయవాడ : ఉద్యోగుల సమస్యల సాధన కై ఇక ప్రత్యక్ష పోరాటం చేయాలని ఉద్యోగ సంఘాలు ఐ కా సా నిర్ణయించటం జరిగిందని సోమ వారం మంత్రుల బృందం తో జరిగే చర్చలు విఫలమైతే ఈ నెల 14 న ఉద్యోగుల ఉద్యమ బాట పడుతున్నామని 27 తేదీ చలో విజయవాడ చేపట్టి ఉద్యోగుల సత్తా నిరూ పిస్తామని ఏపీ జేఏసీ చైర్మన్ బండి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి జి. హృదయ రాజు తెలిపారు. గాంధీనగర్ ఎన్జీవో హోం లో ఆదివారం నిర్వహించిన పత్రికా సమావేశంలో ఉద్యమ కార్యాచరణ, తమ ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి హక్కుగా వివిధ పద్దుల కింద రావలసిన బకాయిల జాబితాను ప్రకటించారు. 12వ పిఆర్సి లో మధ్యంతర భృతి 30శాతం చెల్లింపు, పెండింగ్ లో ఉన్న రెండు డీఏల సొమ్ములు, సిపిఎస్ ఉద్యోగులకు చెల్లించాల్సిన డిఎ లను 90శాతం నగదు రూపంలో చెల్లించడం, పిఎఫ్, ఏపీ జి ఎల్ ఐ రుణాలు, క్లైములు, 11వ పిఆర్సి లో చెల్లించాల్సిన సరెండర్ లీవ్ ఎన్కాష్మెంట్, మెడికల్ రీయంబర్స్మెంట్ బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. వీటితో పాటు 1-9-2004 ముందు నోటిఫై అయిన తర్వాత నియామక ఉత్తర్వులు పొందిన ఉపాధ్యాయులు, ఉద్యోగులకు పాత ఓపిఎస్ విధానాన్ని అమలు చేయాలన్నారు. అన్ని నెట్వర్క్ హాస్పిటల్స్ లో ఇహెచ్ఎస్ కార్డుల ద్వారా నగదు రహిత వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఉద్యోగ, ఉపాధ్యాయులకు మంజూరు చేయటం, ఉపాధ్యాయులకు అప్రెంటిస్ విధానాన్ని అమలు చేసేలా విడుదలైన జీవో 117 ను రద్దు చేయటం, కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్, ఎన్.ఎం.ఆర్, రోజువారి జీతం, పార్ట్ టైం, ఫుల్ టైం విధానంలో పనిచేస్తున్న ఉద్యోగులను క్రమబద్ధీకరించటం, ప్రభుత్వ, పంచాయతీరాజ్ టీచర్లకు ఉమ్మడి సర్వీసు రూల్స్ అమలు చేయటం, గురుకులాలు, సొసైటీ, పబ్లిక్ సెక్టార్ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగుల పదవీ విరమణ వయసు 62 సంవత్సరాలకు పెంపు వంటి అంశాలతో కూడిన తమ డిమాండ్ లను సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అందజేస్తామన్నారు. సోమవారం నాడే మంత్రుల బృందంతో చర్చించేందుకు ఉద్యోగ సంఘ నాయకులు రావాలని ప్రభుత్వం ఆహ్వానించినందున వారితో కూడా తమ డిమాండ్లపై చర్చించనున్నట్లు వివరించారు. వారితో చర్చల అనంతరం వచ్చిన ఫలితాల తర్వాత ఉద్యమ వేడి ఎలా ఉంటుందో జేఏసీ నేతలు వివరించారు.14వ తేదీన నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరు కావడం, తహసిల్దారు, సబ్ కలెక్టర్, కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పణ, 15, 16 తేదీల్లో నల్ల బ్యాడ్జీలు ధరించి మధ్యాహ్నం భోజన విరామ సమయంలో తాలూకా కేంద్రాలు, పాఠశాలల్లో నిరసన కార్యక్రమాలు, 17వ తేదీన తాలూకా కేంద్రాల్లో ర్యాలీలు, ధర్నా చేపట్టడం, 20వ తేదీన జిల్లా కలెక్టరేట్ల వద్ద ర్యాలీ, ధర్నా నిర్వహణ, 21 నుంచి 24 వరకు రాష్ట్ర నాయకులు అన్ని జిల్లాల్లో పర్యటించి 27వ తేదీన చేపట్టనున్న చలో విజయవాడకు ఉద్యోగులను సిద్ధం చేస్తామని చెప్పారు. ఈసారి జరిగే ఉద్యమం ద్వారా ఇప్పటివరకు అపరిష్కృతంగా ఉన్న అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని ఉద్యోగ సంఘాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయన్నారు. పత్రికా సమావేశం అనంతరం అష్ట జేఏసీ చైర్మన్ శ్రీ బండి శ్రీనివాసరావు తదితర రాష్ట్ర జేఏసీ నేతలు ఉద్యమ గోడపత్రికను ఆవిష్కరించారు. సమావేశంలో జేఏసీ డిప్యూటీ సెక్రటరీ జనరల్ కె. శివారెడ్డి, కో చైర్మన్లు హెచ్. తమ్మన్న, కెఎస్ఎస్ ప్రసాద్, డి. చంద్రశేఖర్, ఎన్. చంద్రశేఖర్,జిల్లా అధ్యక్షులు ఎ.విద్యా సాగర్ ఉల్లి కృష్ణ సెక్రటేరియట్ సభ్యులు వెంకటేశ్వర్లు, హరనాథ్, శోభన్ బాబు, బి. సేవానాయక్, రఘుబాబు, వెంకటేష్ బాబు, ఎం. శ్రీనివాసులు, ఎస్. విద్య రాష్ట్రంలోని జిల్లాల జేఏసీ చైర్మన్లు, సెక్రటరీ జనరల్స్, మహిళా ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ప్రభుత్వంపై ఏపీ ఎన్జీవోల సమర శంఖం : వైసీపీ ప్రభుత్వంపై ఏపీ ఎన్జీవోలు మరోసారి సమర శంఖం పూరించారు. సమస్యలపై ఎన్నిసార్లు మొర పెట్టుకున్న సీఎం జగన్ వినడం లేదని ఎన్జీవోలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యల పరిష్కారానికి ఉద్యమానికి వెళ్లాల్సిందేనని వారు నిర్ణయం తీసుకున్నారు. విజయవాడలో ఆదివారం ఏపీ ఎన్జీవో జేఏసీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించింది. సమస్యల పరిష్కారానికి ఉద్యమం చేయాల్సిందేనని నాయకత్వంపై ఒత్తిడి తీసుకు వచ్చారు. ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకుండా ఇన్ని రోజులు కాలయాపన చేస్తున్న సంఘం నేతలు ఎలాంటి చర్యలను ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. సంఘం నేతలు ప్రభుత్వానికి వత్తాసు పలికితే తమ గళం వినిపిస్తామని ఏపీ ఎన్జీవోలు హెచ్చరించారు. డీఏ బకాయిలు, సరెండర్ లీవ్ బకాయిలు, జీపీఎఫ్ , ఏపీ జీ ఎల్ ఐ బకాయిలను ప్రభుత్వం ఇవ్వకపోవడంపై సమావేశంలో మండిపడ్డారు. ఐ ఆర్ 30 శాతం ఇవ్వాల్సిందేనని నేతలు స్పష్టం చేశారు. ధర్నాలు, ర్యాలీలు, ఛలో విజయవాడ వంటి కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు ఉద్యమ కార్యాచరణ ప్రకటించాలని ఏపీ ఎన్జీవోలు నిర్ణయం తీసుకున్నారు. సంఘం నేతలు కూడా తమతో కలిసి రావాలని లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఏపీ ఎన్జీవోలు హెచ్చరించారు.