వెలగపూడి : రాష్ట్రంలో 175 శాసనసభ నియోజకవర్గాలకు గాను 158 చోట్ల ఓటర్ల సంఖ్య
తగ్గింది. 2022 జనవరి 5 నాటికి ఆయా నియోజకవర్గాల పరిధిలో ఉన్న ఓటర్ల కంటే
ప్రస్తుతం (2023 జనవరి 5 నాటికి) తక్కువగా ఉన్నారు. ఏడాది వ్యవధిలో 15,90,802
ఓట్లను ఎన్నికల సంఘం తొలగించటంతో 90 శాతం నియోజకవర్గాల్లో ఓటర్లు గతం కంటే
తగ్గిపోయారు. జాబితాలో పేర్లు పునరావృతమైన వారివి, మరణించిన, వలసపోయిన వారి
ఓట్లే తొలగించినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.
17 నియోజకవర్గాల్లోనే ఓటర్ల పెరుగుదల : రాష్ట్రంలో నియోజకవర్గాల వారీగా
గతేడాది జనవరి 5 నాటికి ఉన్న ఓటర్ల సంఖ్యను ప్రస్తుతమున్న ఓటర్ల సంఖ్యతో
పోల్చి చూస్తే కేవలం 17 చోట్ల మాత్రమే పెరుగుదల ఉంది. మిగతా అన్నిచోట్లా
తగ్గింది. రాష్ట్రంలోనే అత్యధికంగా ఓట్లు తగ్గిన నియోజకవర్గాల్లో మైలవరం-
25,189, గాజువాక- 18,224, విశాఖ తూర్పు- 16,789 మొదటి మూడు స్థానాల్లో
ఉన్నాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా ఓట్లు పెరిగిన నియోజకవర్గాల్లో
నందికొట్కూరు- 2,109, దర్శి-1,964, ఒంగోలు-1,960 తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి.
ఓట్లు తగ్గిన నియోజకవర్గాల వివరాలివి
* 25 వేలు అంతకంటే ఎక్కువ తగ్గుదల ఉన్న నియోజకవర్గాలు- 1
* 20-25 వేల ఓట్లు తగ్గుదల ఉన్న నియోజకవర్గాలు-0
* 15-20 వేల ఓట్లు తగ్గుదల ఉన్న నియోజకవర్గాలు -4
* 10-15 వేల ఓట్లు తగ్గుదల ఉన్న నియోజకవర్గాలు- 11
* 9-10 వేల ఓట్లు తగ్గుదల ఉన్న నియోజకవర్గాలు-2
* 8-9 వేల ఓట్లు తగ్గుదల ఉన్న నియోజకవర్గాలు-6
* 7-8 వేల ఓట్లు తగ్గుదల ఉన్న నియోజకవర్గాలు-11
* 6-7 వేల ఓట్లు తగ్గుదల ఉన్న నియోజకవర్గాలు-13
* 5-6 వేల ఓట్లు తగ్గుదల ఉన్న నియోజకవర్గాలు-16
* 5 వేల ఓట్లలోపు తగ్గుదల ఉన్న నియోజకవర్గాలు-94
* ఓట్లు పెరిగిన నియోజకవర్గాలు-17