9 రాష్ట్రాల్లోనూ బీజేపీ నే గెలవాలి
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా
న్యూఢిల్లీ : 2023లో జరగబోయే 9 రాష్ట్రాల ఎన్నికల్లో ఒక్క చోట కూడా బీజేపీ
ఓటమి పాలవ్వకుండా వ్యూహరచన చేయాలని ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా
పిలుపునిచ్చారు. మోడీ హయాంలోనే దేశంలో అభివృద్ధి జరిగిందని కొనియాడారు.
ఢిల్లీలో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఆయన ఈమేరకు ప్రసంగించారు.
భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఢిల్లీలో అట్టహాసంగా
ప్రారంభమయ్యాయి. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు 2023లో జరగబోయే తొమ్మిది
రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ప్రాముఖ్యాన్ని పార్టీ నేతలకు బీజేపీ అధ్యక్షుడు
జేపీ నడ్డా వివరించారు. 9 రాష్ట్రాల ఎన్నికల్లో ఒక్క చోట కూడా బీజేపీ ఓటమి
పాలవ్వకుండా వ్యూహరచన చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మోడీ
నాయకత్వంలోనే దేశంలో అభివృద్ధి జరిగిందని కొనియాడారు. మోడీ హయాంలో హయాంలో
భభారత ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. మొబైల్ ఫోన్ల
తయారీలో భారత్ రెండో స్థానంలో ఉంది. ఆటోమొబైల్ రంగంలో మూడో అతి పెద్ద
తయారీదారుగా భారత్ నిలిచింది. అనేక సంక్షేమ పథకాలతో పేదలకు సాధికారత
కల్పించేందుకు కేంద్రం కృషి చేస్తోంది. ఇటీవలే గుజరాత్లో బీజేపీ చారిత్రక
విజయాన్ని సాధించింది. 182 మంది సభ్యుల అసెంబ్లీలో 150కి పైగా సీట్లు గెలవడం
అసాధారణమైన విజయం. హిమాచల్ ప్రదేశ్లో బీజేపీ ఓటమిపాలైనా రెండు పార్టీల మధ్య
ఓట్ల తేడా కేవలం ఒక శాతం కంటే తక్కువేనని జాతీయ కార్యవర్గ సమావేశంలో జేపీ
నడ్డా పేర్కొన్నారు.
అంతకుముందు, ప్రధాని నరేంద్ర మోడీ భారీ రోడ్ షో ద్వారా జాతీయ కార్యవర్గ
సమవేశాలు జరిగే ప్రాంగణానికి చేరుకున్నారు. జ్యోతి ప్రజ్వలన చేసిన పార్టీ
జాతీయ కార్యవర్గ సమావేశాలను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. 2 రోజులపాటు జరిగే ఈ
సమావేశాల్లో దేశం ఎదుర్కొంటున్న సమస్యలతోపాటు రాజకీయ, ఆర్థిక అంశాలపై చర్చించి
తీర్మానాలు ఆమోదించనున్నట్లు కమలనాథులు తెలిపారు. పార్టీ అధ్యక్షుడు జేపీ
నడ్డా పదవీకాలం ఈ నెలతో ముగియనున్న నేపథ్యంలో 2024 సార్వత్రిక ఎన్నికల వరకు
ఆయనను కొనసాగించటంపై ఈ భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు. జాతీయ కార్యవర్గ
సమావేశాలకు తొలి రోజు ప్రధాని నరేంద్ర మోడీ, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా,
అమిత్ షా సహా పలువురు కేంద్రమంత్రులు, భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల
ముఖ్యమంత్రులు, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు,
తదితరులు హాజరయ్యారు. గుజరాత్లో భాజపా భారీ విజయం తర్వాత ఇదే తొలి కార్యవర్గ
సమావేశం కావడం గమనార్హం.