విజయవాడ : జనసేన పార్టీని ప్రజల్లో మరింతగా బలోపేతం చేసి 2024 లో రానున్న
ఎన్నికల్లో జనసేన పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు జనసేన విజయవాడ
నగర అధికార ప్రతినిధి, మైనార్టీ నాయకులు షేక్ గయాజుద్దీన్ (ఐజా )చెప్పారు.
ప్రజల్లో, ముఖ్యంగా మైనార్టీలకు జనసేన పార్టీని మరింత చేరువ చేసేందుకు త్వరలో
ఘర్ ఘర్ కో జనసేన కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ఐజా ప్రకటించారు.
బుధవారం సాయంత్రం భవానిపురం లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల
సమావేశంలో ఆయన మాట్లాడారు. జనసేన పార్టీ కోసం తాను అహర్నిశం కృషి
చేస్తున్నానని, జనసేనాని పవన్ కళ్యాణ్ ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చూడాలని
లక్ష్యంతో తాము పార్టీని ప్రజల్లోకి తీసుకెళుతున్నామని ఆయన వివరించారు.
పవన్ కళ్యాణ్ ఆశయాల సాధనలో భాగంగా లక్షలాది రూపాయల సొంత ఖర్చుతో ఎన్నో సామాజిక
సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు. తాను జనసేన పార్టీ
అభివృద్ధి కోసం గట్టిగా నిలబడి పనిచేస్తూ వస్తున్నానని వివరించారు. జనసేన
పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కోసం,పార్టీ కోసం ఎటువంటి త్యాగానికైనా
సిద్ధమని ఐజా ప్రకటించారు. ముస్లిం మైనార్టీలు ఎక్కువగా ఉన్న 40వ డివిజన్
జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఉన్న తన స్థానంలో వేరే వ్యక్తిని కూర్చోబెట్టి
జనసేన సభ్యత్వ నమోదు చేయడం సమంజసంగా లేదని విమర్శించారు.
తన పట్ల జనసేన నగర అధ్యక్షుడు పోతినమహేష్ వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని
ఐజా ధ్వజమెత్తారు. ప్రజల్లో తనకున్న ఆదరణను చూసి ఓర్చుకోలేకపోతున్న కొంతమంది
నాయకులు తనపై గుర్రుగా ఉండటం సరైనది కాదని హెచ్చరించారు. జనసేన పార్టీ కోసమే
పనిచేయడం ప్రతి జన సైనికుడి కర్తవ్యం అని, వ్యక్తిగత అజెండాలకు పార్టీలో చోటు
లేదని గ్రహించాలని అన్నారు. తాను ఏ సామాజిక సేవా కార్యక్రమం చేసిన జనసేన
కోసమేనని గయాజుద్దీన్ చెప్పారు. జనసేన పార్టీ పిలుపునిచ్చిన ప్రతి
కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నానని ఆయన వివరించారు. తమకు
ఇష్టం లేని నాయకులపై కోవర్ట్ లంటూ ముద్ర వేసి అణగదొక్కాలని చూసే సంస్కృతిని
కొంతమంది నాయకులు ఇప్పటికైనా విడనాడాలని సలహా ఇచ్చారు. ఎవరు పార్టీ కోసం
కష్టపడి పనిచేస్తున్నారు అనే విషయమే పార్టీ అధినాయకత్వం ఎప్పటికప్పుడు సమాచారం
తీసుకుంటూనే ఉందని తెలిపారు.