హైదరాబాద్ : హైదరాబాద్‌లో రూ.15 వేల కోట్లతో మైక్రోసాఫ్ట్ ఏర్పాటుచేస్తున్న
అతిపెద్ద డేటా కేంద్రం 2025 నాటికి అందుబాటులోకి వస్తుందని ఆ సంస్థ సీఈవో సత్య
నాదెళ్ల తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌కు తెలిపారు. ఈ
కేంద్రానికి సంబంధించిన పనులు చురుకుగా సాగుతున్నాయన్నారు. తెలంగాణలో
అంకురాలకు, ఐటీ అభివృద్ధికి సహకరిస్తామని చెప్పారు. హైదరాబాద్‌కు వచ్చిన సత్య
నాదెళ్లతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. దాదాపు గంట సేపు భేటీ జరిగింది.
తెలంగాణలో మైక్రోసాఫ్ట్ కార్యకలాపాలు, ఇతర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా
సత్య నాదెళ్ల మాట్లాడుతూ ‘‘ప్రపంచ వ్యాప్తంగా డిజిటల్ పరివర్తనకు వేదికగా
క్లౌడ్ ప్లాట్ఫారానికి డిమాండ్ పెరుగుతోంది. దీనిని పరిగణనలోనికి తీసుకొని
సాంకేతికత పరంగా మరింతగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌లో మా సంస్థకు చెందిన
అతిపెద్ద డేటా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నాం. మైక్రోసాఫ్ట్‌కు చెందిన
మొత్తం క్లౌడ్ పోర్ట్‌ఫోలియో, డేటా సొల్యూషన్స్, ఆర్టిఫీషియల్
ఇంటెలిజెన్స్, ప్రొడక్టివిటీ టూల్స్, పరిశ్రమలు, అంకురాలు, డెవలపర్ల కోసం
అధునాతన సెక్యూరిటీ వ్యవస్థతో డేటా కేంద్రాన్ని అభివృద్ధి చేస్తాం. ప్రపంచం
నవీన సాంకేతికతలవైపు పరుగులు తీస్తోంది. ఇందులో తెలంగాణ ముందంజలో ఉంది. ఐటీ
రంగంలో రాష్ట్రం అద్భుతంగా పురోగమిస్తోంది. భారతీయులు త్వరలోనే ఐటీలో ఆధిపత్యం
వహించే స్థాయికి చేరుకుంటారు. టీహబ్ రెండో దశను ప్రారంభించడం అభినందనీయం.
దాంతో కలిసి పనిచేస్తాం. తెలంగాణలో విద్య, వ్యవసాయం, మౌలిక సదుపాయాల కల్పనకు
సహకరిస్తాం’’ అని అన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ‘‘ తెలంగాణ
ప్రభుత్వ సానుకూల విధానాలు, ఐటీ నిపుణుల లభ్యత వంటి కారణాలతో డేటా కేంద్రాల
ఏర్పాటుకు కంపెనీలు హైదరాబాద్‌వైపు మొగ్గుచూపుతున్నాయి.
మైక్రోసాఫ్ట్‌తో పాటు అమెజాన్ సైతం రూ. 36 వేల కోట్లతో అతిపెద్ద డేటా
కేంద్రాలను స్థాపిస్తోంది. అభివృద్ధి దిశగా పరుగులు పెడుతున్న హైదరాబాద్‌కు
మైక్రోసాఫ్ట్ గొప్ప సహకారాన్ని అందిస్తోంది. తమ రెండో అతిపెద్ద ప్రాంగణాన్ని
ప్రారంభించడంతో పాటు డేటా కేంద్రం ఏర్పాటుకు ముందుకు రావడం, వివిధ రంగాల్లో
రాష్ట్ర అభివృద్ధికి సహకరించడంపై ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు. తెలంగాణలో
సానుకూలతల దృష్ట్యా మరిన్ని పెట్టుబడులు వస్తాయని భావిస్తున్నామని అన్నారు.
వెనుకబడిన జిల్లాల్లో సాంకేతిక అభివృద్ధి, మైక్రోసాఫ్ట్ శిక్షణ కార్యక్రమాలు,
క్లౌడ్ టెక్నాలజీతో చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి తదితర అంశాల, నూతన
సాంకేతికతలపై చర్చించుకున్నట్లు సమాచారం. హైదరాబాద్‌లో కృత్రిమమేధ మిషన్
ఏర్పాటు గురించి కేటీఆర్ వివరించారు. కాగా బెంగళూరులో జరిగిన భవిష్యత్
సాంకేతికతల సన్నద్ధత సదస్సులో హైదరాబాద్ బిర్యానీ గురించి ప్రస్తావించి,
దానికి విశేష ప్రాచుర్యం కల్పించారని సత్యనాదెళ్లకు కేటీఆర్ ధన్యవాదాలు
తెలిపినట్లు తెలిసింది.
బిజినెస్, బిర్యానీల గురించి మాట్లాడుకున్నాం : సత్యనాదెళ్లతో తమ భేటీపై
కేటీఆర్ ట్వీట్ చేశారు ‘‘ఈ రోజు శుభదినం. ఇద్దరు హైదరాబాదీలం సమావేశమయ్యాం.
సంతోషంగా ఉంది. బిజినెస్, బిర్యానీ గురించి చర్చించుకున్నాం’’ అని ఆయన
పేర్కొన్నారు.