గోపాలపూర్ : భారతదేశంలో జన్మించడం ఒక వరమని, స్వాతంత్య్రానంతరం దేశం ఎన్నో
ఆటుపోట్లు అధిగమించి ఇటీవల కాలంలో మహత్తర శక్తిగా ఎదిగిందని కేంద్ర ఆర్థికశాఖ
మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. రెండు రోజుల రాష్ట్ర పర్యటనలో భాగంగా
మరో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో కలిసి వచ్చిన ఆమెకు ఉన్నతాధికారులు,
బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. తర్వాత ఆమె నేరుగా పూరీ చేరుకుని ఒక అతిథి
భవనంలో విశ్రాంతి తీసుకున్నారు. గురువారం ఉదయం పూరీ శ్రీక్షేత్రాన్ని
తొలిసారిగా సందర్శించారు. ఆలయం ఎదుట పాలనాధికారి రంజన్ దాస్, కలెక్టరు
సమర్థవర్మ, ఇతర అధికారులు స్వాగతించారు. తొలుత అరుణ స్తంభం వద్ద పూజలు చేసి
జ్యోతి వెలిగించిన కేంద్ర మంత్రి తర్వాత గర్భగుడిలో పురుషోత్తమ సన్నిధిలో
ధర్మేంద్ర ప్రధాన్‌తో కలిసి ప్రార్ధన చేశారు. మహాలక్ష్మి, విమలా ఆలయాల్లో
పూజలు చేశారు. జగన్నాథుని సన్నిధిలో ఆమె పొర్లు దండాలు పెట్టారు.
యువతతో శపథం : అనంతరం పూరీ పెంటకోట పరిధిలోని సదాశి సంస్కృత
విశ్వవిద్యాలయానికి కేంద్ర మంత్రులు వెళ్లారు. వారికి విద్యార్థులు ఘన స్వాగతం
పలికారు. భారత చిత్రపటం (ఇండియా మ్యాప్) తరహాలో మూడు రంగుల్లో మానవహారంగా
ఏర్పడి అబ్బురపరిచారు. వర్సిటీ క్యాంపస్‌లో వెయ్యి మొక్కలు నాటే
కార్యక్రమానికి మంత్రి శుభారంభం చేశారు. తర్వాత విద్యార్థులను ఉద్దేశించి
మాట్లాడుతూ ఈ దేశం మనకెన్నో ఇచ్చిందని, మాతృభూమి రుణం తీర్చుకోవడానికి మనమంతా
చిత్తశుద్ధి కనబరచాలని చెప్పారు. ‘మేరా భారత్ మహాన్’, సబ్కా సాత్, సబ్కా
వికాస్’ అన్న ధ్యేయంతో ప్రధాని నరేంద్ర మోడీ తొమ్మిదేళ్లుగా అవిశ్రాంతంగా
శ్రమిస్తున్నారన్నారు. 2047 నాటికి భారత్‌ను ప్రపంచ దేశాల్లోకెల్లా అగ్రగామి
చేయాలన్న ఆయన సంకల్పం నెరవేర్చే బాధ్యత యువతరంపై ఉందన్నారు. ఈ సందర్భంగా
నిర్మలా సీతారామన్ విద్యార్థులతో ‘పంచసూత్ర’ ఆచరణపై శపథం చేయించారు.
దేశాభివృద్ధి, సమైక్యత, అఖండత, దృఢ చిత్తం, అంకితభావంతో పనులు చేయాలని
పిలుపునిచ్చారు.
సైకత శిల్పం సందర్శన : పూరీ మేఫెయిర్ తీరంలో యువ శిల్పులు తీర్చిదిద్దిన ‘మో
మట్టి- మో దేశొ’ సైకత శిల్పాన్ని మంత్రి నిర్మలా సీతారామన్ మరో మంత్రి
ధర్మేంద్రతో కలసి తిలకించారు. ఆకట్టుకునేలా ఉందని శిల్పులను అభినందించారు.