వాషింగ్టన్ : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 21 నుంచి 24 వరకు
అమెరికాలో పర్యటించనున్నారు. ఆయన గతంలోనూ అమెరికా వెళ్లినా ఈసారి ఆ దేశ
అధ్యక్షుడి ప్రత్యేక ఆహ్వానంపై తొలిసారిగా అధికార పర్యటన జరపనున్నారు. గడచిన
75 ఏళ్లలో అమెరికాకు అధికార పర్యటన జరిపిన భారతీయ నాయకులు ఇద్దరే ఇద్దరు.
ఒకరు- పూర్వ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ (1963లో). మరొకరు-
మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ (2009లో). అమెరికా అధ్యక్షుడు జో బైడెన్,
ప్రథమ మహిళ జిల్ బైడెన్ జూన్ 22న శ్వేతసౌధంలో మోడీకి అధికార విందు ఇస్తారు.
జూన్ 23న మోడీ అమెరికా కాంగ్రెస్ (పార్లమెంటు) ఉభయ సభలను ఉద్దేశించి
రెండోసారి ప్రసంగించనున్నారు. అంతకుముందు 2016 యాత్రలో తొలి ప్రసంగం ఇచ్చారు.
ఇప్పటివరకూ విదేశాల నుంచి ఇజ్రాయెల్, బ్రిటన్ (చర్చిల్), దక్షిణాఫ్రికా
(నెల్సన్ మండేలా) నాయకులు మాత్రమే ఇలా రెండుసార్లు కాంగ్రెస్‌ను ఉద్దేశించి
ప్రసంగించారు.
విభేదాలను పక్కనపెట్టి : వచ్చే ఏడాది భారత్, అమెరికాలలో ఎన్నికలు
జరగనున్నాయి. ప్రస్తుతం అమెరికాలో పాలక డెమోక్రాట్, ప్రతిపక్ష రిపబ్లికన్ల
మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. కాంగ్రెస్ దిగువ సభలో ప్రతిపక్ష
రిపబ్లికన్లకు, ఎగువ సభలో పాలక డెమోక్రాట్లకు మెజారిటీ ఉంది. అయినా ఉభయ సభల్లో
రెండు పార్టీల నాయకులు విభేదాలను పక్కనపెట్టి మోడీని సంయుక్త సమావేశంలో
ప్రసంగించాలని కోరడం విశేషం. దీన్ని బట్టి మోడీ పర్యటనకు అమెరికా ఎంత
ప్రాముఖ్యమిస్తోందో అర్థమవుతుంది. అధునాతన సాంకేతికతలు, రక్షణ, పారిశ్రామిక
రంగాలలో సహకార వృద్ధికి బైడెన్, మోడీ 2022 మేలో చొరవ తీసుకున్నారు. ఆ
ప్రయత్నాన్ని కీలక, వినూత్న రంగాల్లో భాగస్వామ్యం (ఐసెట్)గా
వ్యవహరిస్తున్నారు. ఈ వారం అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలివన్
ఐసెట్ విషయమై భారతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్‌తో చర్చించడానికి ఢిల్లీ
వస్తున్నారు. రాబోయే దశాబ్దాలలో రక్షణ, అంతరిక్షం, అధునాతన సాంకేతికతలలో
భారత్-అమెరికా భాగస్వామ్యాన్ని మరింత విస్తరించుకోవడానికి బైడెన్, మోడీ
జూన్ 22న సంయుక్త ప్రకటన విడుదల చేస్తారని తెలుస్తోంది. ఇంతకాలం భారత్‌ను తన
వస్తు, సేవలకు సువిశాల మార్కెట్‌గా పరిగణిస్తూ వచ్చిన అమెరికా ఇకపై
భాగస్వామిగా చూస్తుందన్నది సంయుక్త ప్రకటన సారాంశంగా ఉంటుందన్న విశ్లేషణలు
వెలువడుతున్నాయి. తాజా పర్యటనలో మోడీ భారత సంతతి ప్రజలతో, వ్యాపారవేత్తలతో
సమావేశమవుతారు.