కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ గుండె పోటుతో హఠాత్తుగా మరణించిన సంగతి తెలిసిందే. ఆయన జిమ్ చేస్తుండగా కార్డియాక్ అరెస్టుకు గురయ్యారు. విక్రమ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అక్టోబర్ 29న మృతి చెందారు.
పునీత్ రాజ్‌కుమార్ చివరి సినిమా ‘గంధన గుడి’ . ఈ చిత్రానికీ పునీత్ భార్య అశ్విని పునీత్ రాజ్‌కుమార్ నిర్మాతగా వ్యవహరించారు. పునీత్ వర్ధంతికి ఒక్క రోజు ముందు అక్టోబర్ 28న ఈ మూవీ థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై కీలక నిర్ణయం తీసుకున్నారు. పునీత్ నటించిన ‘గంధన గుడి’ కి పన్ను మినహాయింపు ఇస్తున్నట్టు తెలిపారు. అప్పు ఎప్పటికి జీవించే ఉంటారని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
తాజాగా ‘గంధన గుడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్లో బసవరాజ్ బొమ్మైతో పాటు యశ్, రమేశ్ అరవింద్, సాయి కుమార్, సిద్దార్థ్, సూర్య, శరత్ కుమార్, శివ రాజ్ కుమార్, రాఘవేంద్ర రాజ్ కుమార్ ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ‘కెజియఫ్’ నెలకొల్పిన గత రికార్డులన్నింటిని ‘గంధన గుడి’ బ్రేక్ చేయాలని యశ్ అన్నారు. ‘‘ప్రకృతి, జీవితం, భూమిల సెలబ్రేషనే గంధనగుడి. ఈ చిత్రాన్ని భారీ సక్సెస్ చేసి పునీత్‌కు ఘనంగా నివాళులు అర్పించాలి’’ అని యశ్ తెలిపారు. పునీత్ రాజ్ కుమార్ నుంచి చివరగా ‘జేమ్స్’ వచ్చింది. సంచలన విజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద భారీ వద్ద భారీ స్థాయి వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా రూ.100కోట్లకు పైగా కలెక్షన్స్‌ను కొల్లగొట్టింది. ‘జేమ్స్’ రికార్డులన్నింటిని ‘గంధన గుడి’ అధిగమిస్తుందా అంటే విడుదల వరకు వేచి చూడాల్సిందే.