వ్యాగన్ తయారీ, పీవోహెచ్ సహా అభివృద్ధి పనులకు శ్రీకారం
హనుమకొండలో సభ.. అక్కడి నుంచే శంకుస్థాపనలు
విజయ సంకల్ప సభగా నామకరణం
15 నిమిషాలపాటు కొనసాగనున్న పీఎం ప్రసంగం
వరంగల్ : చారిత్రక నగరి ఓరుగల్లులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనకు సర్వం
సిద్ధమైంది. ప్రధాని శనివారం హనుమకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన
అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం బహిరంగసభలో ప్రసంగించనున్నారు.
కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, కిషన్‌రెడ్డి, పార్టీ ముఖ్యనేతలు ఈ
కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రధాని వారణాసి నుంచి ఉదయం 7.35కు ప్రత్యేక
విమానంలో హైదరాబాద్‌లోని హకీంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి
హెలికాప్టర్లో బయలుదేరి వరంగల్‌లోని మామునూరు ఎయిర్‌స్ట్రిప్‌లో దిగుతారు.
తొలుత భద్రకాళి దేవాలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకుంటారు. అక్కడి నుంచి
హనుమకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగసభ వేదిక వద్దకు
చేరుకుంటారు. కాజీపేట అయోధ్యపురంలో ఏర్పాటు చేయనున్న వ్యాగన్ పరిశ్రమ,
పీవోహెచ్‌లకు, జాతీయ రహదారులతో కలిపి మొత్తం రూ.6,109 కోట్ల అభివృద్ధి పనులకు
సభా వేదిక నుంచే ప్రధాని శంకుస్థాపన చేస్తారు. అనంతరం సభలో ప్రసంగిస్తారు.
మధ్యాహ్నం 12.20కల్లా సభ ముగిసేలా షెడ్యూలు ఖరారైంది.
సీఎం ప్రసంగానికి అయిదు నిమిషాలు : హనుమకొండ సభకు విజయసంకల్ప సభగా నామకరణం
చేశారు. సభావేదికపై ప్రధాని సహా మొత్తం ఎనిమిది మంది మాత్రమే కూర్చుంటారు.
కిషన్‌రెడ్డి, నితిన్ గడ్కరీల తర్వాత సీఎం కేసీఆర్ ప్రసంగం ఉంటుందని
షెడ్యూలులో పేర్కొన్నారు. ముగ్గురికీ అయిదేసి నిమిషాలపాటు సమయం కేటాయించారు.
కానీ సీఎం సహా రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులెవరూ ప్రధాని పర్యటనకు హాజరు
కాబోవడంలేదని, ప్రధాని పర్యటనను తాము బహిష్కరిస్తున్నామని మంత్రి కేటీఆర్
ఇప్పటికే ప్రకటించారు. సభలో 15 నిమిషాల పాటు ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగం
ఉంటుంది. ప్రోటోకాల్ మేరకు వేదికపై ప్రధానితోపాటు ఇద్దరు కేంద్ర మంత్రులు,
గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్, కరీంనగర్, వరంగల్ ఎంపీలు బండి సంజయ్,
దయాకర్, రాష్ట్ర మంత్రి ప్రశాంత్‌రెడ్డి మాత్రమే కూర్చునేలా ఏర్పాటు చేశారు.
సభ సమయంలో కోసం ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో భారీ ఏర్పాట్లు చేశారు. వర్షం
కురిసినా ఇబ్బంది కలగకుండా జర్మన్ సాంకేతికతతో నాలుగు షెడ్లు నిర్మించారు.
సభకు భారీ సంఖ్యలో జనసమీకరణ చేస్తున్నందున సుమారు లక్ష కుర్చీలను
వేయిస్తున్నారు. ప్రజలు ప్రధాని ప్రసంగాన్ని తిలకించేందుకు ప్రత్యేకంగా 30
ఎల్ఈడీ తెరలను ఏర్పాటు చేశారు. తొలిసారిగా వరంగల్ వస్తున్న ప్రధాని మోడీకి
ఘన స్వాగతం పలికేందుకు బీజేపీ శ్రేణులు సిద్ధమయ్యాయి. నగరంలోని
పలుప్రాంతాల్లో నరేంద్ర మోడీతోపాటు రాష్ట్ర బీజేపీ అగ్రనాయకుల హోర్డింగులు
ఏర్పాటు చేశారు. పార్టీ జెండాలతో ఓరుగల్లు నగరం కాషాయమయంగా మారింది. కేంద్ర
మంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఏర్పాట్లను
పర్యవేక్షిస్తున్నారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు తరుణ్‌ఛుగ్ సైతం
వచ్చి ఏర్పాట్లను పరిశీలించారు. వరంగల్‌కు 1994లో ప్రధాని హోదాలో పీవీ
వచ్చారు. మళ్లీ ఉమ్మడి వరంగల్‌కు ప్రధానులెవరూ రాలేదు. 29 ఏళ్ల తర్వాత ఇప్పుడు
మోడీ విచ్చేస్తున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర బలగాల
పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పది వేల మంది సిబ్బందితో
కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నారు.