దివాలా అంచున పాకిస్థాన్
మరో శ్రీలంకగా మారనుందా?
విదేశీ మారకం నిల్వలు పాతాళానికి చేరడం వల్ల పాక్ పని అయిపోయినట్లే కనిపిస్తోంది. కేవలం 3 వారాలకు సరిపడా మాత్రమే విదేశీ మారక నిల్వలు ఉన్నట్లు ఆ దేశ సెంట్రల్ బ్యాంక్ తాజాగా చెప్పడం పరిస్థితికి అద్దం పడుతోంది. ఈ నేపథ్యంలో ఆర్థిక సాయం ఇచ్చేందుకు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎమ్ఎఫ్) 2019 విధించిన షరతులకు ప్రత్యామ్నాయం లేక అంగీకరించాల్సి వచ్చింది. ఎంత కష్టమైనా ఆంక్షలకు అనుగుణంగా నడుచుకోవాల్సిందేనని ప్రధాని షెహబాజ్ షరీఫ్ పేర్కొన్నారు.
ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న పాకిస్థాన్లో విదేశీ మారక నిల్వలు పూర్తిగా అడుగంటిపోయాయి. పదేళ్ల కనిష్ఠానికి క్షీణించి కేవలం 3 వారాలకు సరిపడా విదేశీ మారక నిల్వలు ఉన్నట్లు పాక్ సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. బుధవారం నాటికి ఈ నిల్వలు 16.1 శాతం క్షీణించి 3.09 బిలియన్ డాలర్లకు చేరినట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్ తెలిపింది. రుణ చెల్లింపుల వల్ల 592 మిలియన్ డాలర్ల విదేశీ మారకపు నిల్వలు క్షీణించినట్లు సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. ప్రస్తుతం ఆ దేశ కమర్షియల్ బ్యాంకుల వద్ద ఉన్న 5.65 బిలియన్ డాలర్లతో కలుపుకుని మొత్తం విదేశీ మారకపు నిల్వలు 8.74 బిలియన్ డాలర్లు ఉన్నట్లు పేర్కొంది. ద్రవ్యోల్బణం 48 ఏళ్ల గరిష్ఠానికి చేరుకుందని పాక్ ప్రజలు ఆహారం కొనుగోలు చేసేందుకు కూడా తీవ్రంగా అవస్థలు పడుతున్నట్లు చెప్పింది.