టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి
తిరుమల : సామాన్య భక్తులు ఎక్కువ మందికి వైకుంఠ ద్వార సర్వదర్శనం చేయించాలని
టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయించిన మేరకు సోమవారం ఉదయం 6 గంటల నుండే
సర్వదర్శనం ప్రారంభించామని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు.
సర్వదర్శనం ప్రారంభమైన అనంతరం శ్రీవారి ఆలయం ముందు, ఆ తరువాత అన్నమయ్య భవన్లో
వై.వి సుబ్బారెడ్డి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. సామాన్య భక్తుల
దర్శనానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో వైకుంఠ ద్వార దర్శనం జరిగే 10
రోజులు సిఫారసు లేఖలపై జారీ చేసే దర్శనాలు రద్దు చేశామన్నారు. అలాగే శ్రీవాణి
టికెట్లు కూడా ఆఫ్ లైన్లో రద్దు చేసినట్లు ఆయన వివరించారు. సామాన్య భక్తుల
సౌకర్యం కోసం తిరుపతిలోని 9 ప్రాంతాల్లో స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల జారీ
ప్రారంభించామన్నారు. భక్తులు టోకెన్ తీసుకునే వారికి నిర్దేశించిన సమయానికి
తిరుమల క్యూ లైన్ లోకి రావాలని టీటీడీ చేసిన విజ్ఞప్తికి భక్తులు పూర్తిగా
సహకరించారని చైర్మన్ వివరించారు. సర్వదర్శనం ఎలాంటి ఇబ్బంది లేకుండా భక్తులు
లేకుండా వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటున్నారని అన్నారు. అధికారులు,సిబ్బంది
పక్కా ప్రణాళికతో చక్కగా పని చేస్తున్నారని ఆయన అభినందించారు.