ట్విట్టర్ లో వీడియో విడుదల చేసిన ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్
పార్టీలో తిరుగుబాటు నేపథ్యంలో సమావేశం ఏర్పాటు చేసిన శరద్ పవార్
ఈ మీటింగ్ రావాలంటూ ఎన్సీపీ నేతలందరికీ సుప్రియా అభ్యర్థన
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్షుడు, రాజకీయ కురువృద్ధుడు, 83
ఏళ్ల యుద్ధ వీరుడు శరద్ పవార్ కు అండగా నిలిచేందుకు తరలిరావాలంటూ పార్టీ
నేతలు, శ్రేణులకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలె
పిలుపునిచ్చారు. పార్టీలో తిరుగుబాటు నేపథ్యంలో శరద్ పవార్ కు మద్దతుగా నిలబడి
పార్టీ బలాన్ని చాటే సమయం వచ్చిందని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో
పార్టీకి, కార్యకర్తలకు సరైన దిశానిర్దేశం చేయడానికే శరద్ పవార్ పార్టీ
సమావేశం ఏర్పాటు చేశారని తెలిపారు. ఆఫీస్ బేరర్లు, పార్టీ వర్కర్లు పెద్ద
సంఖ్యలో ఈ సమావేశానికి హాజరు కావాలని సుప్రియా అభ్యర్థించారు. ఈమేరకు మంగళవారం
సాయంత్రం పార్టీ శ్రేణులను ఉద్దేశించి సుప్రియా సూలె ఓ వీడియో సందేశాన్ని
ట్విట్టర్ లో విడుదల చేశారు. ఎన్సీపీ సీనియర్ నేత, శరద్ పవార్ అన్న కుమారుడు
అజిత్ పవార్ పార్టీపై తిరుగుబాటు చేసిన విషయం తెలిసిందే. పార్టీ వర్కింగ్
ప్రెసిడెంట్ ప్రఫుల్ పటేల్, మరో ఎనిమిది మంది ఎమ్మెల్యేలతో అజిత్ బీజేపీకి
మద్దతు పలికారు. వెనువెంటనే మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా
చేశారు. ఈ క్రమంలో పార్టీపై పట్టు కోసం అటు శరద్ పవార్ గ్రూపు, ఇటు అజిత్
పవార్ గ్రూపు పోటాపోటీ నిర్ణయాలు తీసుకుంటున్నాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి
మార్పు, అనర్హత వేటు కోసం మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ కు రెండు వర్గాలు లేఖలు
రాశాయి. తాజాగా పార్టీ నేతలంతా తమవెంటే ఉన్నారని నిరూపించుకునేందుకు బుధవారం
రెండు వర్గాల నేతలు పార్టీ సమావేశానికి పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే శరద్
పవార్ కు అండగా ఉందాం రమ్మంటూ పార్టీ శ్రేణులను సుప్రియా సూలె అభ్యర్థించారు.