హైదరాబాద్: తెలంగాణ మంత్రిమండలి సమావేశం ఈ నెల 9వ తేదీన జరగనుంది. సీఎం
కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు ఈ సమావేశాన్ని
నిర్వహించనున్నారు. సీఎం ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి
శనివారం అన్ని శాఖలకు సమాచారం ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ, యాసంగి
ధాన్యం కొనుగోళ్లు, కొత్త క్రీడావిధానం సహా పలు కీలక అంశాలపై చర్చించి
మంత్రిమండలి నిర్ణయాలు తీసుకోనుంది. యాసంగి సీజన్‌కు సంబంధించిన దొడ్డుబియ్యం
(బాయిల్డ్ రైస్) కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం మళ్లీ పేచీ పెడుతోందనే భావనతో
రైతులకు ఇబ్బంది రాకుండా ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని
భావిస్తోంది. వచ్చే వానాకాలం సీజన్‌కు ఎరువులు, విత్తనాలను సమకూర్చుకోవడం, ఇతర
సన్నద్ధతలపైనా మంత్రిమండలి దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది.
పల్లెల్లో ఇళ్ల క్రమబద్ధీకరణపై : మెస్ ఛార్జీల పెంపుదలకు రాష్ట్ర మంత్రివర్గ
ఉపసంఘం చేసిన సిఫార్సులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. రాష్ట్ర ప్రభుత్వం
అమలులోకి తేనున్న కొత్త క్రీడా విధానంపై సిద్ధమైన ముసాయిదాకు ఆమోదముద్ర వేసే
అవకాశం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ స్థలాల్లో నిర్మించుకున్న ఇళ్ల
క్రమబద్ధీకరణపైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పోడు భూములపై హైకోర్టు
నోటీసులకు సమాధానం ఇచ్చే అంశాన్నీ చర్చించనున్నట్లు సమాచారం. కొత్త పీఆర్సీ
కోసం ఇప్పటికే ఉద్యోగ సంఘాల నుంచి వినతులు వస్తున్నాయి. దీనిపై విద్యుత్
సంస్థలు తమ ఉద్యోగ సంఘాల ఐకాస అభిప్రాయాలు తీసుకుని.. ఏడో తేదీన ప్రభుత్వానికి
తుది నివేదిక ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దాని ఆధారంగా విద్యుత్ ఉద్యోగులకు
కొత్త పీఆర్సీపై సర్కారు నిర్ణయం తీసుకోనుంది. గవర్నర్ వద్ద పెండింగులో ఉన్న
పది బిల్లులకు సంబంధించిన అంశాలు, వాటి ఆమోదానికి ప్రత్యామ్నాయాల గురించి కూడా
మంత్రిమండలిలో చర్చిస్తారని సమాచారం. ధార్మిక సంస్థలకు భూ కేటాయింపులు, పలు
ఉత్తర్వులకు ఆమోదం (ర్యాటిఫికేషన్), నియామకాలకు అనుమతులు ఇచ్చే అవకాశం ఉంది.