అమెరికా శాస్త్రవేత్తల అద్భుత ఆవిష్కరణ
ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలైన భూతాపం, ఇంధన కొరతకు శాశ్వత పరిష్కారం
చూపే దిశగా మానవాళి అడుగులేస్తోంది. అమెరికా శాస్త్రవేత్తలు చేసిన కృషితో
నక్షత్రాలకు వెలుగును ప్రసాదించే న్యూక్లియర్ ఫ్యూజన్ చర్య భూమిపై
సాధ్యపడింది. అయితే దీన్ని అందుబాటులోకి వస్తే అతి తక్కువ ఖర్చుతో మానవాళికి
సంబంధించిన ఎన్నో అవసరాలను తీర్చుకోవచ్చు. అసలు న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే ఏంటో
తెలుసుకుందాం.
ప్రపంచం ఎదుర్కొంటున్న రెండు ప్రధాన సమస్యలైన భూతాపం, ఇంధన కొరతకు అద్భుత
పరిష్కారాన్ని కనుగొనే దిశగా మానవాళి కీలక మైలురాయి సాధించింది. నక్షత్రాలకు
వెలుగులను ప్రసాదించే కేంద్రక సంలీన చర్య (న్యూక్లియర్ ఫ్యూజన్)ను పుడమిపై
సాకారం చేసే దిశగా చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. దశాబ్దాలుగా
శాస్త్రవేత్తలు సాగించిన కృషితో ఇది సాధ్యమైంది.
ఏమిటీ ఫ్యూజన్? : సూర్యుడు, ఇతర నక్షత్రాల్లో న్యూక్లియర్ ఫ్యూజన్ ద్వారా
శక్తి వెలువడుతుంది. అందులో తేలికైన హైడ్రోజన్ పరమాణువులు కలిసిపోయి హీలియం
అనే భార మూలకం ఏర్పడుతుంది. ఈ క్రమంలో కాంతి, వేడి రూపంలో అపారశక్తి
వెలువడుతుంది. సౌర వెలుగులు, ఉష్ణానికి మూలం ఇదే. అయితే ఒకేరకమైన రెండు
పరమాణువులను కలపడం చాలా కష్టం. వాటికి ఒకే విధమైన ఆవేశం (ఛార్జ్) ఉంటుంది.
బ్యాటరీల్లో రెండు ధనావేశ అంచులు పరస్పరం వికర్షించుకున్నట్లు.. ఇవి కూడా
కలవవు. అసాధారణ పరిస్థితుల్లోనే కలుస్తాయి. సూర్యుడి కేంద్ర భాగంలోని భారీ
ఉష్ణోగ్రతలు (కోటి డిగ్రీల సెల్సియస్), పీడనం (భూ వాతావరణంతో పోలిస్తే 100
బిలియన్ రెట్లు ఎక్కువ) వల్ల అక్కడ ఫ్యూజన్ సాధ్యమవుతోంది. భానుడి అసాధారణ
గురుత్వాకర్షణ శక్తి వల్ల సహజసిద్ధంగా ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఫ్యూజన్ చర్యలు తీవ్ర వేడితో కూడిన ప్లాస్మాలో జరుగుతాయి. అందులో ధనావేశపు
అయాన్లు, స్వేచ్ఛగా కదిలే ఎలక్ట్రాన్లు ఉంటాయి. దీని లక్షణాలు ఘన, ద్రవ, వాయు
పదార్థాలకు భిన్నం.
తాజా పురోగతి ఏమిటి?
అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న లారెన్స్ లివర్మూర్ నేషనల్ ల్యాబ్‌కు
చెందిన నేషనల్ ఇగ్నిషన్ ఫెసిలిటీ (ఎన్ఐఎఫ్) పరిశోధకులు ఈ నెల 5న ‘ఫ్యూజన్
ఇగ్నిషన్’ అనే కీలక మైలురాయి సాధించారు. సంలీన చర్య కోసం వెచ్చించినదాని
కన్నా ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేయడాన్ని ఫ్యూజన్ ఇగ్నిషన్గా పేర్కొంటారు.
ఇలా చేశారు : ఎన్ఐఎఫ్లో డ్యుటీరియం, ట్రిటియంతో కూడిన కొద్దిపాటి ఇంధనాన్ని
ఒక క్యాప్సూల్‌లో ఉంచారు. దీనిపైకి 192 లేజర్లను ప్రయోగించారు. 10 కోట్ల
డిగ్రీల సెల్సియస్‌కు వేడిచేసే, భూ వాతావరణం కన్నా 100 బిలియన్ల రెట్లు ఎక్కువ
ఒత్తిడిని కలిగించే సామర్థ్యం ఈ పుంజాలకు ఉంది.