నిర్వహించుకుంటున్నారురాష్ట్ర ప్రభుత్వ పండుగలుగా నిర్వహిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ
పండగల సందర్భంగా పేదలకు దుస్తులు ఇస్తూ..భోజనాలు పెడుతున్న గొప్ప సంస్కృతిని
కేసిఆర్ తీసుకొచ్చారు
క్రిస్మస్ పండుగ నూతన వస్త్రాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్
రావు
వరంగల్ : మతం పేరుతో, మత పిచ్చితో కొంతమంది రాజకీయాలు చేసే వాళ్ళు ఉన్నారు.
వారికి మతం మీద కంటే వారి స్వార్ధమే ముఖ్యం. మత పిచ్చితో రాజకీయాలు చేసేవాళ్లు
మూర్ఖులని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
క్రిస్టియన్ మైనారిటీలకు క్రిస్మస్ పర్వదినం సందర్భంగా అందిస్తున్న నూతన
వస్త్రాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి నేడు రాయపర్తి చర్చిలో పాల్గొని
క్రిస్టియన్ సోదర, సోదరీమణులకు కొత్త దుస్తులను అందించి, కేక్ కట్ చేసి
చిన్నారులకు తినిపించి, క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఫాస్టర్స్
ప్రత్యేక ప్రార్థనలు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్,
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కి, రాష్ట్ర ప్రజలకు శుభాశీస్సులు అందించారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ రాయపర్తి చర్చిలో
ఈరోజు ఈ వేడుకలు జరపుకోవడం సంతోషం. క్రీస్తు ప్రభువు మన అందరినీ
ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఇజ్రాయిల్లో పుట్టి ప్రపంచ వ్యాప్తంగా
క్రీస్తు ప్రభువు అయ్యారు. ప్రపంచం అంతటా ఆరాధిస్తున్నారు. అన్ని మతాలను అందరూ
గౌరవించాలి. అభిమానించాలి. మనకు రాముడు, విష్ణువు శివుడు, దేవుళ్ళుగా ఉన్నారు.
ముస్లింలకు అల్లా, క్రిస్టియన్లకు క్రీస్తు ఉన్నారు. ఈ మతం, ఆ మతం పేరుతో
చిచ్చు పెట్టే ప్రయత్నం చేయొద్దు. కొన్ని రాజకీయ పార్టీలు గానీ, విశ్వాసం
లేనోళ్ళు చిచ్చులు పెట్టి మతాల పేరు మీద రాజకీయం చేస్తున్నారు. భగవంతుని మీద
ప్రేమ కంటే మత పిచ్చితో రాజకీయాలు చేసేటోళ్లను మూర్ఖులు అంటారు. అన్ని మతాలను
గుర్తించిన మహానుభావుడు సీఎం కేసీఆర్. ప్రతి పండగను ప్రభుత్వ పండగగా
గుర్తించారు. గతంలో ఎవరూ ఇలా చేయలేదు. నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో అన్నీ
మతాలకు ఇంత విలువ ఇచ్చి జరిపిస్తుంది సీఎం కేసీఆర్ ఒక్కరే. గతంలో ఏ మతం
వాళ్ళు ఆ మతం పండగలను వాళ్ళే చేసుకునే వారు. దసరాను హిందువులు, రంజాన్ ను
ముస్లింలు, క్రిస్మస్ ను క్రిస్టియన్లు చేసుకునే వారు. కానీ సీఎం కేసీఆర్
వచ్చాకే అన్ని మతాల పండగల్లో అన్ని మతాల వారు పాల్గొనేలా రాష్ట్ర ప్రభుత్వ
పండుగలుగా నిర్వహిస్తున్నారు. ఇపుడు అన్ని పండగల్లో మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే,
కలెక్టర్, అధికారులు పాల్గొనేలా సక్సెస్ చేసింది సీఎం కేసీఆర్.
పండగ ఏర్పాట్లు కూడా ప్రభుత్వమే చేస్తుంది. ఇవన్నీ ప్రజలు, అన్ని మతాల వాళ్ళు
విశ్లేషించుకోవాలి. పండగల సందర్భంగా పేదలకు దుస్తులు పంపిణీ చేస్తున్నారు.
విందులు ఇస్తున్నారు. గతంలో హైదరాబాద్ లో మత కల్లోలాలు ఉండేవి. గత 8 ఏళ్లుగా
ఎలాంటి గొడవలు లేకుండా, చిన్న సంఘటన జరగకుండా పండగలు జరుగుతున్నాయి. ప్రభువు
అంతట ఉన్నాడు. రాముడు అంతటా ఉన్నాడు. అందరి దేవుళ్ళను అన్ని మతాల వాళ్ళు
గౌరవించాలి. కేసిఆర్ వచ్చాకే మాకు అనేక అధికారాలు ఇచ్చారు. నిధులు ఇచ్చారు.
ప్రభుత్వ డబ్బులు కూడా చర్చిలు, మసీదులు, గుడులకు పెట్టే అవకాశం ఇచ్చారు.
నేను కూడా నా నిధుల్లో చర్చిలు, మసీదులు, దేవాలయాలకు ఖర్చు పెట్టాను. ఇంకా
అవసరం అంటే చర్చిలకు ఇస్తాను. ఇది మన అందరి పండగ. పండగను అందరిదిగా భావించి,
క్రిస్మస్ రోజున సర్పంచ్ ముందట పడి కార్యక్రమాల్లో పాల్గొనాలి. ప్రభువు
ఆశీస్సులు మనకు ఉండడం వల్లే ఈ స్థాయికి వచ్చాం. నేను ఎమ్మెల్యే కాకముందు
ఇజ్రాయిల్ పోయాను. అక్కడ మీ మిత్రులు ప్రభువును చూసి రావాలి అంటే నేను
జెరూసలేం వెళ్ళాను. కానీ అక్కడికి వెళ్ళాక అక్కడే ఉండాలని అనిపించి రెండు
రోజులు ఉన్నాను. దేవుడు అన్ని రూపాల్లో ఉంటారు. ప్రభువు కూడా భగవంతుడే. అన్ని
మతాల సహకారం ఆశీర్వాదం మనం తీసుకోవాలి. నిన్న కేసిఆర్ పెద్ద ఎత్తున క్రిస్మస్
విందు ఇచ్చారు. దాదాపు 2 లక్షల 85 వేల మందికి దుస్తులు ఏటా ఇస్తున్నారు.
దాదాపు 30 కోట్ల రూపాయలు భోజనాలు, బట్టలకు ఖర్చు చేస్తున్నారు. ఎంత
ఇస్తున్నారని కాకుండా దీనిని పేదలకు కేసిఆర్ ఇచ్చిన కానుకగా భావించాలి. దీనిని
గుర్తు పెట్టుకోవాలి. మీకు ఏ ఇబ్బంది ఉన్నా మా దృష్టికి తీసుకొస్తే పరిష్కారం
చేస్తామని హామీ ఇస్తున్నా. మరోసారి క్రిస్టియన్ సోదర సోదరీమణులకు క్రిస్మస్
శుభాకాంక్షలు తెలిపారు.
కలెక్టర్ డాక్టర్ బి.గోపి మాట్లాడుతూ మన దేశంలో గొప్ప సంస్కృతితో క్రిస్మస్
పండగ చేసుకుంటున్నాం. ఒకవైపు అయ్యప్ప స్వాములు, మరోవైపు క్రిస్టియన్లు కలిసి
ఘనంగా ఈ పండగ జరుపుకోవడం విశేషం అన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశ్విని తనాజి వకాడే, డి.ఆర్.డి.ఏ పిడి సంపత్
రావు, రాయపర్తి ఎంపీపీ జినుగు అనిమి రెడ్డి, జెడ్పీటీసీ రంగు కుమార్, మండల
రైతు బంధు కన్వీనర్ ఆకుల సురేందర్ రావు, ఫాస్టర్ ఆనంద్, ఫాష్టర్ల అధ్యక్షులు
రత్నపాల్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.