విజయవాడ : ఏపీ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ కి సంబందించి అభ్యర్థుల వయోపరిమితి పెంచాలని కోరుతూ యువత నుంచి పెద్ద ఎత్తున వినతులు అందడంతో అర్హత వయోపరిమితి రెండేళ్లు పెంచుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని రాజ్యసభ సభ్యులు, వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా శనివారం పలు అంశాలు వెల్లడించారు. యువతకు ప్రయోజనం చేకూర్చేలా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆశావహుల నుంచి హర్షాతిరేకాలు వెల్లువెత్తుతున్నాయిని ఆయన అన్నారు. ఆ నిర్ణయం ప్రజలకు కావలసింది అందించడంలో, వారి కష్టాలు తీర్చడంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చిత్తశుద్దికి అద్దం పడుతోందని అన్నారు.
సిక్కింలో రోడ్డు ప్రమాదంలో ముగ్గురు కమీషన్డ్ అధికారులతో పాటు 16 మంది సైనికులు మృతి చెందిన వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని విజయసాయి రెడ్డి అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని, ప్రమాదంలో గాయపడిన సైనికులు త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్ధిస్తున్నానని తెలిపారు.