హైదరాబాద్ : ఈడీ కేసు విచారణకు తెరాస ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి హాజరుకాలేదు. ఇవాళ తమ ఎదుట హాజరుకావాలని ఈడీ నోటీసు జారీ చేసిన నేపథ్యంలో ఆయన హైకోర్టులో నిన్న రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈడీ కేసును పూర్తిగా కొట్టివేయాలని పిటిషన్లో కోరారు. ఈనెల 15న పీఎంఎల్ఏ కింద ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యేలకు ఎర కేసులో భాగంగానే ఈడీ అధికారులు ఈసీఐఆర్ 48/2022 నమోదు చేసి రోహిత్‌రెడ్డిని రెండు రోజుల పాటు ప్రశ్నించారు. ఇదే కేసులో అభిషేక్ అనే గుట్కా వ్యాపారికి కూడా నోటీసులు ఇచ్చి ప్రశ్నించారు. వీరిద్దరితో పాటు నందకుమార్‌ను కూడా ఈడీ అధికారులు చంచల్‌గూడ జైల్లో ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యేలకు ఎర కేసులో మనీలాండరింగ్ లేకుండానే ఈడీ అక్రమంగా తనపై కేసు నమోదు చేసిందని రోహిత్‌రెడ్డి నిన్న రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై బుధవారం విచారణ జరుపుతామని హైకోర్టు తెలిపింది.