విజయవాడ : రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణకు సీఎం వైయస్ జగన్ అధిక ప్రాధాన్యత
ఇస్తున్నారని రాష్ట్ర పర్యవరణ, అటవీ, ఇంధన, సైన్స్ అండ్ టెక్నాలజీ, గనులశాఖ
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. విజయవాడలోని ఆంధ్రప్రదేశ్
ఎన్విరాన్ మెంట్ మేనేజ్ మెంట్ కార్పోరేషన్ (ఎపిఇఎంసిఎల్) కార్యాలయంలో స్పెషల్
చీఫ్ సెక్రటరీ (పర్యావరణం) నీరబ్ కుమార్ ప్రసాద్, కార్పోరేషన్ ఎండి ఖజూరియా,
చైర్మన్ గుబ్బా చంద్రశేఖర్ లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా
కాలుష్య కారక వ్యర్థాల నిర్వహణకు సంబంధించి కొత్తగా ఏర్పాటు చేసిన పోర్టల్ ను
ఆయన ప్రారంభించారు. రాష్ట్రంలోని థర్మల్ పవర్ స్టేషన్ల నుంచి ఉత్పత్తి
అవుతున్న ఫ్లైయాష్ నిర్వహణను ఇకపై ఎపి ఎన్విరాన్ మెంట్ మేనేజ్ మెంట్
కార్పోరేషన్ పరిధిలోకి తీసుకువస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పది థర్మల్ పవర్ ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి అవుతున్న
ఫ్లైయాష్ పై పూర్తిస్థాయిలో పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా ఒక ఆన్ లైన్ పోర్టల్
ను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఈ పోర్టల్ లో ఫ్లైయాష్ ఉత్పత్తి,
కొనుగోలుదారులు, రవాణాదారులకు సంబంధించిన పూర్తి సమాచారం ఉంటుందని అన్నారు.