భారత్ జనరిక్ మందులను భారీగా కొనుగోలు చేస్తున్న చైనీయులు
బీజింగ్ : కరోనా కేసులతో ఉక్కిరిబిక్కిరవుతున్న కమ్యూనిస్టు చైనాను ఇప్పుడు
యాంటీ వైరల్ డ్రగ్స్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. దీంతో ఆ దేశవాసులు తమ
ప్రాణాలను రక్షించుకోవడానికి భారత్‌వైపు చూస్తున్నారు. వైరస్ కట్టడికి చైనా
ప్రభుత్వం అనుసరించిన ‘జీరో కొవిడ్’ విధానం ఘోరంగా విఫలమవ్వడం, ఆ దేశం తయారు
చేసిన టీకాల ప్రభావం అంతగా లేకపోవడంతో ఇప్పుడు ఎక్కడ చూసినా రోగులతో
ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. దీనికి తోడు యాంటీ వైరల్ డ్రగ్స్ కొరత
పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చింది. ఈ నేపథ్యంలో భారత్ జనరిక్ ఔషధాలకు
చైనా బ్లాక్మార్కెట్లో విపరీతంగా డిమాండు పెరిగింది. ప్రిమోవిర్,
పాక్సిస్టా, మోల్నుట్, మోల్నాట్రిస్.. తదితర మందులను కొనుగోలు చేసేందుకు
చైనీయులు డార్క్‌వెబ్, ఇతర ఆన్లైన్ మాధ్యమాలను ఆశ్రయిస్తున్నారు. ఫైజర్‌కు
చెందిన పాక్స్లోవిడ్, చైనా ఫార్మా సంస్థ తయారు చేసిన అజువుడిన్ లాంటి యాంటీ
వైరల్ డ్రగ్స్ చైనాకు అందుబాటులో ఉన్నా అవి కొన్ని ఆస్పత్రుల్లోనే
లభ్యమవుతున్నాయి. నిజానికి భారత ఔషధాలకు చైనా ప్రభుత్వ అనుమతి లేదు. అయినా
ప్రాణాలు రక్షించుకొనేందుకు చైనీయులు రకరకాల మార్గాల్లో వీటిని కొనుగోలు
చేస్తున్నారు.