తెనాలి : కొత్త సంవత్సరంలో తెనాలి అభివృద్ధికి పునరంకితం అవుతామని జనసేన
పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. కుల మతాలకు అతీతంగా
ప్రతి ఇంటికీ మేలు జరిగే విధంగా, అభివృద్ధి ఫలాలు అందాలన్న లక్ష్యంతో జనసేన
పార్టీ ముందుకు వెళ్తుంది అన్నారు. శనివారం తెనాలి పట్టణంలోని పినపాడు
ప్రాంతానికి చెందిన మాజీ కౌన్సిలర్, వైసీపీ మైనారిటీ నేత జాకిర్ హుస్సేన్ తో
సమావేశమయ్యారు. తన అనుచరులతో కలసి జనసేన పార్టీలో చేరుతున్నట్టు జాకిర్
హుస్సేన్ ఈ సందర్భంగా ప్రకటించారు. అనంతరం నాదెండ్ల మనోహర్ మీడియాతో
మాట్లాడుతూ గతంలో తెనాలికి కీర్తి ప్రతిష్ఠలు తేవాలన్న నిబద్ధతతో కలసి పని
చేశామని, ప్రస్తుత అధికారంలో ఉన్నవారిలో ఆ నిబద్ధత కరవయ్యిందని అన్నారు.
తెనాలి ప్రజలు అభివృద్ధి గురించి మాట్లాడడానికే ఇబ్బంది పడుతున్న పరిస్థితులు
ఉన్నాయని చెప్పారు మాట్లాడితే సంక్షేమం గురించి మాత్రమే చెబుతున్నారనీ అది
నీటి మీద రాత అన్నారు. కౌన్సిలర్ గా తన పదవీకాలంలో జాకిర్ హుస్సేన్ ప్రతి
ఒక్కరికీ ఉపయోగపడే విధంగా పని చేశారని తెలిపారు. అప్పట్లో ప్రజల కోసం కలసి పని
చేశాం. ఈ ప్రయాణంలో భాగస్వాములవడానికి మరోసారి ముందుకు వచ్చిన జాకిర్
హుస్సేన్, అతని అనుచరులకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను అన్నారు. తెనాలి
నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. జాకిర్ హుస్సేన్
మాట్లాడుతూ మైనారిటీలకు జగన్ రెడ్డి న్యాయం చేస్తారని వైసీపీలో చేరి తప్పు
చేశామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు బండారు
రవికాంత్, తోటకూర వెంకటరమణారావు, పసుపులేటి మురళీకృష్ణ, ఇస్మాయిల్ బేగ్
తదితరులు పాల్గొన్నారు.