రాత్రి 12 వరకు సర్వీసులు పొడిగించిన మెట్రో
హైదరాబాద్ :నాంపల్లిలో ఆదివారం నుంచి ప్రారంభమైన నుమాయిష్ సందర్శకుల కోసం
మెట్రో సర్వీసులను అధికారులు పొడిగించారు. ఇప్పటి వరకు రాత్రి 11 గంటలకు
మెట్రో ఆఖరి రైలు బయలుదేరుతుండగా దానిని రాత్రి 12 గంటల వరకు పొడిగించారు.
నుమాయిష్ సందర్శకులు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని మెట్రో రైలు ఎండీ
ఎన్వీఎస్ రెడ్డి సూచించారు. నుమాయిష్ పూర్తయ్యే వరకు అంటే ఫిబ్రవరి 15 వరకు
మెట్రో సేవల పొడిగింపు కొనసాగుతుందని ఆయన వివరించారు.
మియాపూర్-ఎల్బీనగర్, నాగోల్ –రాయదుర్గం కారిడార్లలో ఈ వెసులుబాటు
కల్పించినట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా గాంధీభవన్
మెట్రో స్టేషన్లో టిక్కెట్ కౌంటర్లను 6కు పెంచినట్లు వివరించారు.
ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నూతన సంవత్సరం
సందర్భంగా డిసెంబర్ 31న రాత్రి 2 గంటల వరకు మెట్రో సర్వీసులను నడిపించినట్లు
తెలిపారు. మెట్రో రైళ్లలో మద్యం సేవించకూడదని, మెట్రో సిబ్బందికి, పోలీసులకు
సహకరించాలని ప్రయాణికులకు మెట్రో అధికారులు విజ్ఞప్తి చేశారు.