తూర్పుగోదావరి : పింఛన్లు పెంచుకుంటూ పోతామన్న హామీని మీ బిడ్డగా
నిలబెట్టుకున్నానని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి
పేర్కొన్నారు. రాజమండ్రిలో పింఛన్ లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా
మంగళవారం ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. పింఛన్లు
కేవలం వృద్ధులకు మాత్రమే కాదు. రకరకాల సమస్యలతో బాధపడుతున్న అర్హులైన
వాళ్లందరికీ అందుతున్నాయి. ప్రభుత్వం తరపున పేదలకు అందిస్తున్న ఆ పెన్షన్
సాయం దేశంలో ఎక్కడా ఈ స్థాయిలో అందడం లేదని, అది మీ బిడ్డ పరిపాలనలోనే
జరుగుతోందని సీఎం జగన్ సగర్వంగా ప్రకటించుకున్నారు. కొత్తగా మరికొందరికి
పింఛన్లు జాబితాలో చేర్చామని, అందుకోసం నిధులను సైతం ప్రభుత్వం విడుదల
చేసిందని గుర్తు చేశారు. కొత్తగా బియ్యం కార్డులు, ఆరోగ్య శ్రీ కార్డులు
వలంటీర్లు ఇంటికి వెళ్లి మరీ అందిస్తున్నారని ఆయన ప్రకటించారు.
పింఛన్లు రూ. 2,500 నుంచి రూ.2,750కి పెంచాం. ఖర్చుకు వెనకాడకుండా లబ్ధిదారుల
సంక్షేమం కోసం పాడుపడుతున్నాం. గత ప్రభుత్వంలో కేవలం 39 లక్షల మందికి మాత్రమే
పెన్షన్ అందేది. మేం అధికారంలోకి వచ్చాక ఆ సంఖ్య పెరిగింది. ఇప్పుడు ఏకంగా 64
లక్షల మందికి పెన్షన్ అందిస్తున్నాం. గత ప్రభుత్వంలో పెన్షన్ల కోసం చేసిన
ఖర్చు కేవలం రూ.400 కోట్లు. ఈ ప్రభుత్వంలో పెన్షన్లకే రూ.1,765 కోట్లు
ఇస్తున్నాం. దేశంలో రూ. 2,750 నుంచి పదివేల రూపాయల దాకా పెన్షన్ ఇస్తున్న
ఏకైక రాష్ట్రం ఏపీనే. గత ప్రభుత్వంలో పింఛన్లు కావాలంటే జన్మభూమి కమిటీల
చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. లంచాలు చెల్లించాల్సిన పరిస్థితి. కానీ, ఇప్పుడు
గత ప్రభుత్వంలో మాదిరి పింఛన్ల విషయంలో వివక్ష లేదు, అవినీతికి తావు లేదు,
కత్తిరింపులు లేవు, ఎగ్గొట్టడాలు లేవు. ఇప్పుడు ఎక్కడా ఎలాంటి తారతమ్యాలు
లేకుండా కేవలం అర్హత అనే దాని ప్రామాణికంగా పింఛన్ అందిస్తున్న వ్యవస్థ మీ
బిడ్డ హయాంలో జరుగుతోంది. ఇది మనసున్న పరిపాలన. చెడు చేసిన వాళ్లకు సైతం
మంచి చేయాలనే తపనే తప్ప మరొక ఉద్దేశ్యమే కనిపించదని ఆయన స్పష్టం చేశారు. గత
ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి తేడాలను గమనించాలని లబ్ధిదారులను ఉద్దేశించి
సీఎం వైఎస్ జగన్ పిలుపు ఇచ్చారు.