బోలెంగ్ : భారతదేశం ఎన్నడూ యుద్ధాన్ని ప్రేరేపించలేదనీ, పొరుగు దేశాలతో
సత్సంబంధాలనే కోరుకుంటుందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఉద్ఘాటించారు.
సరిహద్దుల్లో ఎలాంటి సవాళ్లు ఎదురైనా తిప్పికొట్టే సత్తా మన సైనిక దళాలకు
ఉందని స్పష్టం చేశారు. సరిహద్దు రహదారుల సంస్థ (బీఆర్వో)
అరుణాచల్‌ప్రదేశ్‌లోని బోలెంగ్కు సమీపంలో నిర్మించిన ఒక వంతెనను ఆయన
ప్రారంభించారు. సరిహద్దుల్లో, ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో మౌలిక వసతుల
అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం విశేష ప్రాధాన్యమిస్తోందని తెలిపారు. దీనివల్ల
దేశ భద్రత అభేద్యంగా తయారవుతుందన్నారు. వాస్తవాధీన రేఖపై తవాంగ్ సెక్టార్లో
గత నెల 9న చైనా సైనికుల అతిక్రమణను మన జవాన్లు సాహసోపేతంగా అడ్డుకున్న
మూడున్నర వారాలకు రక్షణ మంత్రి ఈ ప్రాంతాన్ని సందర్శించారు. అరుణాచల్‌లో
పశ్చిమ సియాంగ్, ఎగువ సియాంగ్ జిల్లాలను కలిపే ఆలో-యింగ్ కియాంగ్ రహదారిపై
ఆర్చి ఆకారంలో నిర్మించిన 100 మీటర్ల పొడవైన ప్రత్యేక ఉక్కు వంతెనను
రాజ్‌నాథ్ ప్రారంభించారు. కొత్త వంతెన స్థానికుల రాకపోకలకే కాకుండా శత్రు
దురాక్రమణ సందర్భంలో సేనలు, ట్యాంకులు, ఫిరంగులు, ఇతర యుధ్ధ సామగ్రి వేగంగా
సరిహద్దుకు చేరుకోవడానికీ తోడ్పడుతుందని తెలిపారు. ఉక్కు వంతెనతో పాటు మరో 27
బీఆర్వో ప్రాజెక్టులను కూడా ఆయన వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ 28 ప్రాజెక్టుల
నిర్మాణ వ్యయం రూ.724.30 కోట్లు. వీటిలో అయిదింటిని అరుణాచల్‌ప్రదేశ్‌లో,
ఎనిమిదింటిని లద్దాఖ్‌లో, నాలుగు జమ్మూకశ్మీర్‌లో; సిక్కిం, పంజాబ్,
ఉత్తరాఖండ్‌లలో మూడేసి చొప్పున, రాజస్థాన్‌లో రెండు నిర్మించారు.