విజయవాడ : రాష్ట్రంలోని వివిధ నగరాలు, ప్రాంతాల నుండి మరియు పొరుగు రాష్ట్రాల
నుండి ఆంధ్రప్రదేశ్ లోని స్వస్థలాలకు చేరుకునే ప్రయాణికుల కోసం ఈ సంక్రాంతి
పండుగకు 6400 ప్రత్యేక సర్వీసులను నడిపేందుకు ఏపీఎస్ఆర్టీసీ ఇప్పటికే
కార్యాచరణ చేసింది. ఈ ప్రత్యేక బస్సు సర్వీసులన్నీ అదనపు ఛార్జీలతో కాకుండా
సాధారణ ఛార్జీలతోనే నడుస్తాయి. ప్రజల, ప్రయాణీకుల ఆకాంక్షలను ఏపీఎస్ఆర్టీసీ
ఎప్పటికప్పుడు నిశితంగా గమనించి, విశ్లేషించి, వారి మనోభావాలకు అనుగుణంగా
మాత్రమే నిర్ణయాలను అమలు పరుస్తోంది. తదనుగుణంగా సేవలను అందిస్తోంది. ఆ
పరిణామ క్రమంలోని అద్భుత నిర్ణయమే.
సాధారణ చార్జీలతో – ప్రత్యేక బస్సుల ఏర్పాటు : గత 2021 సంవత్సరము వరకూ
ఏపీఎస్ఆర్టీసీ పండుగ సందర్భాలలో ‘ప్రత్యేక’ (1 ½ రెట్ల వసూలు) చార్జీలతో
ప్రత్యేక బస్సులను నిర్వహించేవారు. ప్రైవేటు బస్సుల నిర్వాహకులు కూడా ఇదే
తరహాను అనుసరించి ఏపీఎస్ఆర్టీసీ 1 ½ రెట్ల చార్జీ వసూలు చేస్తే, వారు మాత్రం
ఏకంగా 4-5 రెట్ల ఎక్కువ మేర వసూలు చేసేవారు. చివరగా ప్రయాణీకులే అంతిమ
బాదితులుగా మిగులుతున్నారన్న విషయాన్ని గ్రహించి ఏపీఎస్ఆర్టీసీ
ప్రయాణీకులందరికీ మేలు చేకూర్చే విధంగా, ‘ప్రత్యేక చార్జీల’ వసూలును
ఎత్తివేస్తూ, గత దసరా పండుగ నుంచి సాధారణ ఛార్జీలతోనే ప్రత్యేక బస్సు
సర్వీసులు నడిపి ప్రయాణికుల మన్ననలు పొందింది. ప్రయాణీకులు కూడా ప్రైవేటు
బస్సులు మరియు ఇతర వాహనాలపై ఎక్కువగా ఆధారపడకుండా ఏపీఎస్ఆర్టీసీ బస్సులనే బాగా
ఆదరించారు. ఆదాయమూ పెరిగింది. అదే ఉత్సాహంతో ఈ 2023 సంక్రాంతికి కూడా
ప్రయాణికులపై అదనపు ఛార్జీ భారం పడకుండా బస్సులు నడపాలని నిర్ణయించింది.
ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులకు కూడా సాధారణ ఛార్జీలను వసూలు చేసే నిర్ణయం
వలన, ప్రయాణీకుల నుండి అద్భుతమైన సానుకూల స్పందన రావడమే కాకుండా, ప్రైవేటు
ఆపరేటర్లు సైతం ఏపీఎస్ఆర్టీసీ బాటలోనే నడిచి, ఛార్జీలను తగ్గించుకున్నారుకూడా.
దేశంలోని ఇతర రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలు కూడా, ఏపీఎస్ఆర్టీసీ కి ప్రజలలో
పెరుగుతున్న ఆదరణ, అధిక ఆదాయ గణాంకాల నమోదు విధానాలను గమనించాయి. వెంటనే, తమ
తమ ప్రతినిధులను విజయవాడలోని ఆర్టీసీ ప్రధాన కార్యాలయానికి పంపి ఇక్కడి
నిర్ణయాల అమలు తీరును తమ ఆర్టీసీలలో ప్రవేశ పెట్టి, వారి మనుగడను, ఆక్యు
పెన్సీ రేషియో(ఓఆర్ ) ను పెంచుకొనే కార్యక్రమాలలో తలమునకలవుతున్నారు. ఇటీవల
సంస్థలో తిరుగు ప్రయాణ ఛార్జీపై 10% రాయితీ సౌకర్యం ప్రవేశపెట్టబడినందున, ఈ
పండుగ సమయంలో కూడా ఏ.పి.ఎస్.ఆర్.టి.సి. ద్వారా తిరుగు ప్రయాణం టిక్కెట్లు బుక్
చేసుకున్నట్లైతే వారు అతి తక్కువ ఛార్జీతో ప్రయాణించవచ్చు. ఇప్పటికే ఈ
“రిటర్న్ జర్నీ కన్సెషన్” కాన్సెప్ట్ ప్రయాణికులను బాగా ఆకట్టుకోవడమే కాకుండా
మంచి ఆదరణ కూడా పొందింది.