హైదరాబాద్ : ఇండియన్ రైల్వేకు ప్రత్యేక ఆకర్షణగా మారిన వందేభారత్ రైలు ఈ
నెలలోనే దక్షిణ మధ్య రైల్వేలో పట్టాలెక్కే అవకాశం కనిపిస్తోంది. కాజీపేట
మీదుగా సికింద్రాబాద్–విజయవాడ మధ్య ఇది పరుగుపెట్టనుంది. దీన్ని
ప్రారంభించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ నగరానికి వచ్చే అవకాశం ఉన్నందున,
దీంతోపాటు మరికొన్ని రైల్వే ప్రా జెక్టులకు కూడా శంకుస్థాపనలు/ప్రారంభోత్సవాలు
నిర్వహించేందుకు వీలుగా సన్నాహాలు జరుగుతున్నాయి. కాజీపేటలో నిర్మించతలపెట్టిన
పీరియాడికల్ ఓవర్ హాలింగ్ వ్యాగన్ వర్క్‌షాప్ ప్రాజెక్టుకు సంబంధించి
కొద్ది రోజుల క్రితమే టెండర్‌ను ఖరారు చేసిన రైల్ వికాస్‌నిగమ్ లిమిటెడ్ ఆ
పనులను ఓ సంస్థకు అప్పగించిన విషయం తెలిసిందే. ఇక సికింద్రాబాద్ స్టేషన్ రీ
డెవలప్మెంట్ ప్రాజెక్టు కూడా టెండర్లు ఖరారై పనులను ప్రారంభించుకుంటోంది. ఈ
రెండు పనులను లాంఛనంగా ప్రారంభించటంతోపాటు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న
సికింద్రాబాద్–మహబూబ్‌నగర్ రెండో లైన్ పనులు పూర్తయినందున దాన్ని
ప్రారంభించాల్సి ఉంది. వందేభారత్ రైలు ప్రారంభంతోపాటు ఈ మూడు పనులకు కూడా
శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. ప్రధానమంత్రి కార్యాలయం నుంచి అధికారిక ఆమోదం
అందాల్సి ఉంది.
లాబీయింగ్ లేకపోవటం లోపం : రైల్వే ప్రాజెక్టుల విషయంలో రైల్వే బోర్డుపై
ఒత్తిడి ఉంటేనే త్వరగా సాధ్యమవుతుంది. ఆ విషయంలో తెలంగాణ వెనకబడి ఉందనే
చెప్పాలి. వందే భారత్ రైళ్ల కోసం చాలా జోన్లు ముమ్మరంగా లాబీయింగ్
చేస్తున్నాయి. ఈ విషయంలో దక్షిణ మధ్య రైల్వే పక్షాన ఢిల్లీలో పొలిటికల్
లాబీయింగ్ బలహీనంగా ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పట్టాలెక్కిన
ఏడు వందేభారత్ రైళ్లలో దక్షిణ భారతానికి దక్కింది ఒక్కటే. మిగతావన్నీ ఉత్తర
భారత్‌కే పరిమితమయ్యాయి. కనీసం రెండు రైళ్లన్నా దక్షిణ భారత్‌కు దక్కాల్సి
ఉంది. ఇప్పటికైనా కొంత ఒత్తిడి పెరగకుంటే దక్షిణమధ్య రైల్వేకు మంజూరైన ఈ రైలు
మరో జోన్‌కు మళ్లే ప్రమాదం ఉందన్న వాదనలూ లేకపోలేదు.
సికింద్రాబాద్–విజయవాడ మధ్య 130 కి.మీ. వేగంతో పరుగు : వాస్తవానికి
వందేభారత్ రైలు గంటకు 160 కి.మీ. వేగంతో పరుగుపెట్టగలదు. టెస్టింగ్ సమయంలో
180 కి.మీ.వరకు విజయవంతంగా పరుగెత్తింది. కానీ సికింద్రాబాద్–విజయవాడ మధ్య
అది 130 కి.మీ. వేగంతో తిరుగుతుంది. ఆ ట్రాక్ గరిష్ట వేగ సామర్థ్యం అంతే.
విశేషమేంటంటే.. ఈ ట్రాక్‌లో ఈ గరిష్ట వేగంతో తిరిగే మొదటి రైలు వందేభారతే
కానుంది. కొంతకాలం క్రితమే సికింద్రాబాద్– కాజీపేట మధ్య ట్రాక్
సామర్థ్యాన్ని గంటకు 110 కి.మీ. నుంచి 130 కి.మీ. వేగానికి పెంచారు. కానీ
మూడో లైన్ నిర్మాణ పనులు, ఇతర నిర్వహణ పనుల వల్ల వేగం తగ్గుతోంది. ఇప్పుడు
వందేభారత్ రైలు వస్తే, ఆ అడ్డంకులు ఉన్నాగరిష్ట వేగంతో వెళ్లే అవకాశం ఉంది.