అమరావతి : తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖపై సీఎం వైయస్.జగన్
మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 8వ తరగతి విద్యార్థులకు
ట్యాబులు పంపిణీ పూర్తయిందని అధికారులు వెల్లడించారు. ట్యాబుల
మెయింటైనెన్స్కు సంబంధించి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో సర్వీస్ సెంటర్ను
కంపెనీ ద్వారా ఏర్పాటు చేస్తున్నామని అధికారులు వివరించారు. ట్యాబుల్లో
ఎలాంటి సమస్య ఉన్నా వారంరోజుల్లో మరమ్మత్తు చేసి లేదా కొత్త ట్యాబును
విద్యార్థికి అందించాలని సీఎం ఆదేశించారు. ట్యాబుల వాడకం? పాఠాలను
నేర్చుకుంటున్న తీరు తదితర అంశాలపై ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా నిరంతర
పర్యవేక్షణ ఉంటుందని అధికారులు తెలిపారు. డేటా అనలిటిక్స్ ద్వారా
విద్యార్థులు నేర్చుకుంటున్న తీరుపై నిరంతర పరిశీలన ఉండాలని, దీనికి అనుగుణంగా
హెడ్ మాస్టర్, ఎంఈఓలు తగిన విధంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కోరారు.
తరగతి గదుల డిజిటలైజేషన్లో భాగంగా ఐఎఫ్పి ప్యానెల్స్ ఏర్పాటుపై
తీసుకుంటున్న చర్యలను అధికారులు వివరించగా వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం
అయ్యే నాటికి ఐఎఫ్పి ప్యానెల్స్ ఏర్పాటు కావాలని సీఎం ఆదేశించారు. నాణ్యత
విషయంలో ఎలాంటి రాజీ వద్దని, ఈ డిజిటల్ స్క్రీన్లు వల్ల విద్యార్థులకు
అత్యుత్తమ బోధన అందాలని, వీటిని ఉపయోగించుకుని ఎలా బోధన చేయాలో టీచర్లకు
చక్కటి అవగాహన, శిక్షణ కల్పించాలని కోరారు.
పిల్లలు అందరివద్దా డిక్షనరీలు ఉన్నాయా? లేవా? మరోసారి పరిశీలన చేయాలని, లేని
పిల్లలు అందరికీ డిక్షనరీలు ఇవ్వాలని, వచ్చే విద్యా సంవత్సరం విద్యాకానుక
కోసం అన్నిరకాల ఏర్పాట్లు చేసుకోవాలని సీఎం ఆదేశించారు. విద్యా సంవత్సరం
ప్రారంభం నాటికి పిల్లలకు విద్యాకానుక అందాలని, పాఠశాలల్లో సబ్జెక్టుల వారీగా
టీచర్లు ఉండేలా చూసుకోవాలని, ఏ స్కూల్లో లేకపోయినా వెంటనే టీచర్లు ఉండేలా
చూసుకోవాలని, సబ్జెక్టుల వారీగా టీచర్లను పెట్టడం వల్ల బోధనలో నాణ్యత
పెరుగుతుందని, విద్యార్థుల అభ్యాసం కూడా మెరుగుపడుతుందని అన్నారు. డీఎస్సీ 98
అభ్యర్థులకు పోస్టింగులు త్వరగా ఇవ్వాలని, గోరుముద్ద నాణ్యతను నిరంతర పరిశీలన
చేయాలన్న సీఎం అన్ని స్కూళ్లు, అంగన్వాడీలకు సార్టెక్స్ ఫోర్టిఫైడ్ బియ్యం
మాత్రమే సరఫరా చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.
ఈ సమావేశంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ,
గృహనిర్మాణ, గ్రామ వార్డు సచివాలయాలశాఖ
స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్
ప్రకాష్, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్ గుల్జార్, విద్యాశాఖ సలహాదారు ఏ
సాంబశివారెడ్డి, ఇంటర్ మీడియట్ విద్య కమిషనర్ ఎం వీ శేషగిరిబాబు, పాఠశాల
మౌలిక వసతులు కల్పన కమిషనర్ కాటమనేని భాస్కర్, పౌరసరఫరాలశాఖ కమిషనర్ జీ
వీరపాండ్యన్, మిడ్ డే మీల్స్ డైరెక్టర్ నిధి మీనా, నాడు నేడు డైరెక్టర్
(టెక్నికల్) మనోహర్ రెడ్డి, మహిళా శిశు సంక్షేమశాఖ డైరెక్టర్ డాక్టర్ ఏ
సిరి, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ (పాఠశాల విద్యాశాఖ) ప్రతాప్ రెడ్డి, ఇతర
ఉన్నతాధికారులు పాల్గొన్నారు.