ఎట్టకేలకు విజయం సాధించిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి
వాషింగ్టన్: అమెరికా కాంగ్రెస్ (పార్లమెంటు) దిగువ సభ (ప్రజాప్రతినిధుల సభ)
స్పీకర్గా రిపబ్లికన్ పార్టీకి చెందిన కెవిన్ మెకార్థీ ఎట్టకేలకు
ఎన్నికయ్యారు. కొన్ని రోజులుగా ఓటింగ్ మీద ఓటింగ్ జరుగుతూ వచ్చింది. చివరకు
15వ దఫా ఓటింగులో ఆయన నెగ్గగలిగారు. అంతకుముందు పలుసార్లు అవమానకర రీతిలో
మెకార్థీ ఓడిపోయినా, గెలవడానికి కావల్సిన మెజారిటీని డెమోక్రటిక్ పార్టీ
ప్రత్యర్థి హకీం సెకూ జెఫ్రీస్ సాధించలేకపోయారు. ప్రస్తుతం సభలో
రిపబ్లికన్లకే స్వల్ప మెజారిటీ ఉండటం దీనికి కారణం. చివరకు 15వ దఫా ఓటింగులో
మెకార్థీ 216-212 ఓట్ల తేడాతో జెఫ్రీస్ను ఓడించి స్పీకర్ పీఠాన్ని
అధిరోహించారు. అమెరికాకు దీర్ఘకాలిక సమస్యలైన ప్రభుత్వ రుణ భారంపైన, చైనా
కమ్యూనిస్టు పార్టీ బలం పుంజుకోవడంపైనా దృష్టి కేంద్రీకరిస్తానని, ఈ సమస్యలపై
కాంగ్రెస్ (పార్లమెంటు) ఒకే స్వరం వినిపించాలని మెకార్థీ తన తొలి ప్రసంగంలో
చెప్పారు. ఎన్నికల తర్వాత 435 మంది సభ్యులున్న సభలో రిపబ్లికన్లకు 222 సీట్లు,
డెమోక్రాట్లకు 212 సీట్లు లభించాయి. స్పీకర్ ఎన్నిక కోసం అమెరికా చరిత్రలో
అత్యంత సుదీర్ఘ ఓటింగ్ 1855లో సంభవించింది. అప్పట్లో రెండు నెలలపాటు
133సార్లు ఓటింగ్ జరిగింది.
దేశం కోసం రిపబ్లికన్లతో కలిసి పనిచేస్తా : బైడెన్
మెకార్థీని అధ్యక్షుడు జో బైడెన్ అభినందించారు. ఇది బాధ్యతాయుతంగా
పాలించాల్సిన సమయమని గుర్తుచేశారు. దేశ ప్రయోజనాల కోసం ప్రతిపక్ష
రిపబ్లికన్లతో కలసి పనిచేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు.