విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర౦లో దాదాపుగా అన్ని జిలాలలో ఎన్నో ప్రముఖ
పుణ్యక్షేత్రాలు, సందర్శనీయ ప్రదేశాలు ఉన్నాయనే విషయం అందరికీ విదితమే. ప్రపంచ
వ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన పవిత్ర పుణ్యక్షేత్రాలైన తిరుమల శ్రీ వెంకటేశ్వర
స్వామి, తిరుచానూరు పద్మావతి అమ్మవారు, కాణిపాకం వినాయకుని గుడి, శైవ
క్షేత్రo శ్రీ కాళహస్తి , విజయవాడ కనకదుర్గ, అన్నవరం సత్యనారాయణ స్వామి తదితర
దేవాలయాలను దర్శించేందుకు మన రాష్ట్రం నలుమూలల నుండే కాకుండా, ఇతర రాష్ట్రాల
నుండి కూడా అనేక మంది భక్తులు నిత్యం విచ్చేస్తుంటారు. అలా పుణ్యక్షేత్రాల
దర్శనం కోసం వచ్చే యాత్రికులు, భక్తులు, ప్రయాణికుల కోసం ఇప్పటి వరకు వివిధ
ప్యాకేజీలతో కూడిన, బస్సులు లేదా ట్రిప్పులు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసి
లేవు. అయితే, ఇకపై ఏ.పి.ఎస్.ఆర్.టి.సి. ఈ విషయంలో ప్రత్యేక దృష్టి
సారించనుంది. రాత్రి సమయాలలో భక్తులు ఇబ్బంది పడకుండా వసతి ఏర్పాటు చేయడం,
సంబంధిత పుణ్య క్షేత్రాల చరిత్ర, గొప్పతనం తెలియజేసేందుకు టూరిస్ట్ గైడ్ లను
కూడా అందుబాటులో ఉంచాలని ఏ.పి.ఎస్.ఆర్.టి.సి. యోచిస్తోంది. దీనికి సంబంధించి
టూరిజం శాఖతో సంప్రదిస్తూ ప్రణాళికలు రచిస్తోంది. భక్తులను ఆకట్టుకునే విధంగా
ప్రత్యేక ప్యాకేజీలు తీసుకొచ్చేందుకు సమాయత్తమవుతోంది.
వివిధ పుణ్యక్షేత్రాల దర్శనానికై రైలు ద్వారా ప్రయాణించే భక్తుల కంటే
బస్సులలో ప్రయాణించే వారికి తక్కువ సమయంలో, ఎక్కువ దేవాలయాలు సందర్శించేందుకు
అనువుగా ఉంటుంది. ఈ ఆలోచనలను కార్య రూపం లో అమలు కొరకు ఆర్టీసీ సన్నాహాలు
చేస్తోంది. ఏ.పి.ఎస్.ఆర్.టి.సి ఇప్పటికే ప్రతి సంవత్సరం కార్తీకమాసం,
ధనుర్మాసం, శబరిమల దర్శనం వంటి ప్రత్యేక నెలలలో దైవదర్శనం చేసుకునే భక్తుల
కోసం కొన్ని ప్రత్యేక బస్సులు వివిధ ప్రాంతాల నుండి నడిపి ప్రయాణికుల ఆదరణ
చూరగొన్నది.
‘మహాశివరాత్రి’ కి కోటప్పకొండకు, ‘దసరా’ కు విజయవాడ కనక దుర్గ గుడికి దగ్గరలో
ఉన్న ఇతర పుణ్యక్షేత్రాలనికి కూడా కొన్ని ప్రత్యేక సర్వీసులు ఇలా ముఖ్య పండుగ
రోజులలో ప్రయాణికులకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటోంది.
అంతేకాకుండా వివిధ నగరాలు, ప్రాంతాల, జిల్లాల నుండి తిరుపతి-తిరుమల దర్శించే
భక్తులకు రిజర్వేషన్ తో పాటు శ్రీవారి ‘శీఘ్రదర్శన’ టిక్కెట్లు గత రెండేళ్ళగా
అందుబాటులోకి తీసుకొచ్చింది. అదేవిధంగా శ్రీశైలం రిజర్వేషన్ చేయించుకునే
భక్తుల కోసం ‘స్పర్శ దర్శన’ టిక్కెట్లు త్వరలో ఏ.పి.ఎస్.ఆర్.టి.సి.
కల్పించబోతున్నది కూడా. ప్రజలనుంచి వచ్చే డిమాండును పరిగణనలోకి తీసుకుని
మరిన్ని ప్రాంతాలకు బస్సులు నడిపే యోచనలో ఉంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం
చేసుకోవాలని, ఆర్టీసీని ఆదరించాలని ఎండీ సిహెచ్. ద్వారకా తిరుమల రావు
ప్రయాణీకులను కోరుతూ, అందరికీ నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు
తెలిపారు.