ఏలూరు : క్రీడా స్పూర్తితో ముందడుగు వేస్తే విజయం తధ్యమని హాకీ ఆంధ్రప్రదేశ్ సభ్యుడు, రాజ్ భవన్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పిఎస్ రాజశేఖర్ అన్నారు. ఏలూరు సి ఆర్ ఆర్ కాలేజ్ ఆప్ ఇంజనీరింగ్ కేంద్రంగా జరుగుతున్న 13వ ఆంధ్రప్రదేశ్ సీనియర్ మహిళల అంతర్ జిల్లా హాకీ ఛాంపియన్ షిప్ పోటీలకు గురువారం ఆయన ముఖ్య
అతిధిగా హాజరయ్యారు. కాకినాడ, అనంతపురం జిల్లా జట్ల మధ్య సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుండగా, ఆ బృందాలను పరిచయం చేసుకుని పోటీని ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ హకీ క్రీడకు పూర్వవైభవం తీసుకురావాలసిన బాధ్యత నేటి యువతపై ఉందని సూచించారు. శుక్రవారంతో పోటీలు ముగియనుండగా ఫైనల్స్ కు కాకినాడ, విశాఖపట్నం జట్లు చేరుకున్నాయి. గత మూడు రోజులుగా విభిన్న జిల్లాల నుండి వచ్చిన 14 జట్లు ఛాంపియన్ షిప్ కోసం పోటీ పడ్డాయి. కార్యక్రమంలో అసోసియేషన్ ఏలూరు జిల్లా కార్యదర్శి సతీష్, పరిశీలకుడు రవిరాజా, రాష్ట్ర స్దాయి క్రీడాకారులు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.