హనుమకొండ : మకర సంక్రాంతి ఉత్సవాలను పురస్కరించుకొని మాజీ రాజ్యసభ సభ్యులు
కెప్టెన్ వి లక్ష్మి కాంతారావు, హుస్నాబాద్ శాసనసభ్యులు వొడితల సతీష్ కుమార్
నివాసంలో ఏర్పాటుచేసిన బొమ్మల కొలువు సందర్శకులను ఆకట్టుకుంటున్నది. ప్రతి ఏటా
సాంప్రదాయబద్ధంగా సంక్రాంతిని పురస్కరించుకొని బొమ్మల కొలువు ఏర్పాటు చేయడం
ఆనవాయితీగా వస్తోంది. కెప్టెన్ సతీమణి వొడితల సరోజినీ దేవి, ఎమ్మెల్యే వొడితల
సతీష్ కుమార్ సతీమణి డాక్టర్ వొడితల షమిత, సతీష్ కుమార్ కుమార్తె డాక్టర్
పూజిత, కోడలు డాక్టర్ శంసిత, వొడితల కుటుంబ సభ్యులు బొమ్మల కొలువును
తీర్చిదిద్దారు. పురాణాల్లోని, ఇతిహాసాల్లోని వివిధ ఘట్టాలను వివరించే విధంగా
బొమ్మల కొలువును కన్నులకు కట్టినట్లు ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తోంది.
గతంలో రామాయణ, మహా భారత, భాగవతాల్లోని వివిధ ఘట్టాలను వివరిస్తూ బొమ్మల
కొలువులు ఏర్పాటు చేశారు. కాగా ఈసారి శ్రీ అనఘాదేవి దత్తాత్రేయుని చరిత్రను,
వైశిష్ట్యాన్ని వివరించే విధంగా వివిధ ఘట్టాలను బొమ్మలతో తీర్చిదిద్దారు.
అత్రి మహర్షి అనసూయ దేవి లకు మహావిష్ణువు అంశతో దత్తాత్రేయుడు జన్మించడం,
దేవతలకు జంభాసురునికి మధ్య యుద్ధం జరగడం, దేవతలు దత్తాత్రేయుని ఆశ్రయించిన
తర్వాత హోమగుండం నుండి ఆయుధాలు వచ్చి జంభాసురున్ని సంహరించడం, కార్త
వీర్యార్జునునికి రావణుడికి యుద్ధం జరగడం, రావణుడిని బ్రహ్మ వచ్చి విడిపించడం,
కార్తవీరుడు తపస్సు చేసి దత్తాత్రేయుడు అనఘా దేవి ఆశీస్సులతో అనఘాష్టమి వ్రతం
ద్వారా అష్టసిద్ధులను పొందడం, దత్తాత్రేయుడు భూలోకంలోకి రావడం, మహావిష్ణువు
కృష్ణమలక (నల్ల ఉసిరిక) వృక్షాన్ని సహ్యాద్రి పర్వత శ్రేణికి తీసుకురావడం,
వృక్షం కింద మణిద్వీపం, ద్వీపంలో అష్టసిద్ధులు, పరివారం ఆసీనులై ఉండడం, అలాగే
బ్రహ్మ వేదాలను మరచిపోవడం అనఘా దేవి, రేణుకా దేవిల మహిమతో తిరిగి వేదాలను
పొందడం వంటి ఘట్టాలను చూపరులను ఆకట్టుకునే విధంగా దేవత మూర్తులతో, వివిధ రకాల
బొమ్మలతో, ఆకృతులతో అలంకరించారు. ఈ బొమ్మల కొలువు సందర్శకులను కట్టిపడేసింది.
బొమ్మల కొలువును పలువురు సందర్శించి అభినందించారు. అనఘా దేవి, దత్తాత్రేయుని
వైశిష్టాన్ని తెలుపుతూ బొమ్మల కొలువును అద్భుతంగా తీర్చిదిద్దారని
ప్రశంసించారు. కెప్టెన్ నివాసంలో భోగి సంక్రాంతి పర్వదినాలను పురస్కరించుకొని
బొమ్మల కొలువు సందడి నెలకొంది. ఈ బొమ్మల కొలువు కార్యక్రమంలో మాజీ రాజ్యసభ
సభ్యులు కెప్టెన్ వి లక్ష్మీకాంతరావు, హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్
కుమార్, ఇంద్రనీల్, డాక్టర్ కుచ్చులకంటి అనురాగ్ తదితరులు పాల్గొన్నారు.
బొమ్మల కొలువును సందర్శించిన భువనేశ్వరి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ కమలానంద భారతి
మహాస్వామి, మాజీ రాజ్యసభ సభ్యులు కెప్టెన్ వి లక్ష్మీకాంతరావు నివాసంలో
ఏర్పాటు చేసిన బొమ్మల కొలువును భువనేశ్వరి పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ కమలానంద
భారతి మహాస్వామి వారు సందర్శించి ప్రశంసించారు. ఇలాంటి కొలువులు భక్తులు ప్రతి
చోట ఏర్పాటు చేయాలని తద్వారా వేదాలు పురాణాల్లోని నీతి ప్రజలకు చేరుతుందని
అభిలషించారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా పిల్లలను, యువకులను ఆధ్యాత్మికత వైపు
అడుగులు వేయించాలని కోరారు.