సింహాచలం : సింహగిరి పై భక్త జన సంద్రం నెలకొంది. శనివారం తెల్లవారు జామునుంచే
వేలాది మంది భక్తులు సింహగిరికి తరలి రావడంతో ఎటు చూసిన భక్తులు కోలాహలమే
కనిపించింది. కొండ పైన పైన కొండ దిగువనా వేలాది వాహనాలతో
సింహగిరి కిక్కిరిసిపోయింది. శనివారం సింహాద్రినాధుడుకు ప్రీతికరమైన రోజు
కావడం, భోగి పర్వదినానికి గ్రామీణ ప్రాంతాలతో పాటు భారీగా భక్తులు తరలిరావడంతో
స్వామిని దర్శించుకోవడానికి భక్తులు గంటల తరబడి భారీగా క్యూలైన్లులో ఎదురు
చూశారు. తరలి వచ్చిన భక్తులను అదుపు చేయడం ఒక దశలో ఎవరి తరం కాలేదు. ఆలయ
అధికారులు భక్తులకు వీలైనంత త్వరగా దర్శనం కల్పించే ఏర్పాట్లు చేశారు.
సింహగిరి పై సంక్రాంతి సంబరాలు ఘనంగా ప్రారంభం
సంక్రాంతి పర్వదినం నేపథ్యంలో సింహగిరిపై గ్రామీణ ప్రాంత వాతావరణం కల్పించే
విధంగా ఏర్పాట్లు చేశారు. పల్లెలను తలపించే విధంగా ధాన్యం బస్తాలు, వరి
కుప్పలు, ఎద్దుల బళ్ళు, నివాసాలు, డూడు బసవన్నలు, హరిదాసులు, బొమ్మల కొలువు ,
కోలాటాలు, తప్పెట గుళ్ళు ఏర్పాటు చేశారు. సింహాద్రి నాధుడు ఆలయము విశేష
అలంకరణలతో తీర్చి దిద్దారు.
వైభవముగా గంగ ధార వద్ద సింహాద్రి నాధుడు ప్రతి నిధిగా గోవింద రాజ స్వామి, అమ్మ
వార్లు కు విశేష అభిషేకాలు అర్చనలు గావించారు. ఆలయ అర్చక స్వాములు స్వామి
అమ్మవార్లకు తిరు మంజనం గావించారు. ధర్మ కర్తల మండలి సభ్యులు గంట్ల శ్రీను
బాబు, దినేశ్ రాజ్ ప్రత్యేక పూజలు గావించి స్వామి, అమ్మ వార్లను సేవించు
కున్నారు.
వైదికంగా విశిష్టమైన పండుగ భోగి : స్వాత్మానందేంద్ర స్వామి
సింహాచలం పుణ్యక్షేత్రంలో సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. భోగి మంటలతో
వేడుకలకు శ్రీకారం చుట్టారు. నాలుగు రోజుల పాటు సాగే సంక్రాంతి సంబరాలను విశాఖ
శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి ప్రారంభించారు.
భోగి మంటల వద్ద దేవస్థానం పండితులు పూజలు నిర్వహించారు. మంటల్లో పిడకలు వేసి
సంబరాలను ప్రారంభించారు. అనంతరం వరాహ లక్ష్మీనరసింహ స్వామిని
దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వాత్మానందేంద్ర స్వామి మాట్లాడుతూ సంక్రాంతి
పండుగ సామాన్యుల పండుగగా అభివర్ణించారు. భోగి పండుగకు వైదికంగా, పౌరాణికంగా
విశిష్టత ఉందని అన్నారు. పల్లె సంప్రదాయాలను పాటిస్తూ పట్టణ ప్రాంతాల్లోను
విశేషంగా పండుగలను జరుపుకోవడం ఆనందదాయకమని తెలిపారు. సింహాచలం దేవస్థానం ప్రతి
ఏటా సంక్రాంతి సంబరాలను నిర్వహించడం అభినందనీయమని ప్రశంసించారు. భగవంతుని
అనుగ్రహం, తమ గురువులు స్వరూపానందేంద్ర స్వామివారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపైనా
ఉండాలని స్వాత్మానందేంద్ర స్వామి ఆకాంక్షించారు. రైతులు బాగుండాలని,
పాడిపంటలతో తెలుగు రాష్ర్టాలు సస్యశ్యామలంగా కళకళలాడుతూ ఉండాలని అప్పన్నను
ప్రార్థించినట్లు చెప్పారు. ఆయా కార్య క్రమంలో సింహాచలం దేవస్థానం ధర్మకర్తల
మండలి సభ్యులు గంట్ల శ్రీను బాబు, దినేశ్ రాజ్, దొడ్డి రమణ, శ్రీదేవి వర్మ,
సువ్వాడ శ్రీదేవి, ప్రత్యేక అహ్వనితులు చందు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భముగా ధర్మ కర్తల మండలి సభ్యులు కాసేపు సేవలందించారు.