ప్రారంభిస్తారుకంటి వెలుగు శిబిరాల నిర్వహణ పట్ల కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా
సమీక్షించిన రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు
ఖమ్మం : జనవరి 19న ఉదయం 9 గంటల నుంచి జిల్లాలలో కంటి వెలుగు కార్యక్రమం
ప్రారంభించాలని రాష్ట్ర ఆర్థిక వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు
కలెక్టర్ లను ఆదేశించారు. సోమవారం మంత్రి హరీష్ రావు ఖమ్మం కలెక్టర్
కార్యాలయం నుంచి, రాష్ట్ర సీఎస్ శాంతికుమారి , డీజిపి అంజనీ కుమార్, వైద్య,
ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వి, కమిషనర్ శ్వేతలు హైదరాబాద్ బీఆర్కె
భవన్ నుంచి కంటి వెలుగు క్యాంపుల నిర్వహణ పట్ల తీసుకోవాల్సిన చర్యల పై అన్ని
జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ
సందర్భంగా రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు మాట్లాడుతూ,
సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని అమలు
చేస్తున్నారని, ఇది చాలా సున్నితమైన కార్యక్రమమని, దీనిని పకడ్బందీగా అమలు
చేయాలని అన్నారు. కంటి వెలుగు క్యాంపుల నిర్వహణ సమయంలో ఎలాంటి అవాంచనీయ
సంఘటనలు జరగకుండా పోలీసు వారు తగిన భద్రత కల్పించాలని మంత్రి తెలిపారు.
జనవరి 18న ఖమ్మం లో సీఎం కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని లాంచనంగా
ప్రారంభిస్తారని, జిల్లాలలో జనవరి 19న ఉదయం 9 గంటలకు మంత్రులు, ఎమ్మెల్యేలు,
శాసనమండలి సభ్యులు,జడ్పీ చైర్మన్లు జెడ్పిటిసి, ఎంపిటిసి, సర్పంచులు వారి
పరిధిలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించాలని మంత్రి సూచించారు.
గతంలో కంటే బృందాల సంఖ్యను రెట్టింపు చేసినందున అధికంగా ప్రజలకు కంటి వెలుగు
క్యాంపులు అందుబాటులో వచ్చే విధంగా అధికారులు పనిచేయాలని, ప్రజలకు
సౌకర్యార్థంగా అవసరమైన ఏర్పాట్లు చేయాలని, చిన్న పొరపాటు కూడా జరగకుండా
జాగ్రత్త వహించాలని ఆమె సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఎంపీలు నామా
నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్, స్థానిక
సంస్థల అదనపు కలెక్టర్ స్నేహాలత మొగిలి, ఖమ్మం మునిసిపల్ కమీషనర్ ఆదర్శ్
సురభి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. బి. మాలతి, జిల్లా ప్రధాన
ఆసుపత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు, జెడ్పి సిఇఓ వి.వి. అప్పారావు,
మున్సిపల్ కమిషనర్లు, తదితరులు పాల్గొన్నారు.