న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ
సమావేశాలు ముగిశాయి. రెండు రోజుల పాటు జరిగిన సమావేశాల్లో కీలక నిర్ణయాలు
తీసుకున్నారు. ఈ సమావేశాల సందర్బంగా రానున్న లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ
కౌంట్‌డౌన్ మొదలుపెట్టింది. బీజేపీ పార్టీ నేతలకు, కార్యకర్తలకు ప్రధాని
నరేంద్ర మోడీ కీలక సూచనలు చేశారు. కాగా మరో 400 రోజుల్లో లోక్‌సభ ఎన్నికల్లో
ఎదుర్కొనేందుకు పార్టీ నాయకులంతా సిద్ధం కావాలని మోదీ పార్టీ నాయకులకు
పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో తిరిగి పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన
పార్టీ శ్రేణులకు భరోసా నింపారు. అయితే, ఇందుకోసం పార్టీ నాయకులంతా ప్రజల్లోకి
వెళ్లాలని కోరారు. అన్ని వర్గాల ప్రజలను కచ్చితంగా కలుసుకోవాలని దిశా నిర్దేశం
చేశారు. ప్రభుత్వం చేపడుతున్న పథకాలను కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని
ప్రధాని పార్టీ నాయకులను కోరారు. ఎన్నికలు కేవలం 400 రోజుల్లోనే ఉన్న
నేపథ్యంలో మిషన్ మోడ్‌లో పనిచేయాలని కోరారు.
తెలంగాణ , పశ్చిమబెంగాల్ లాంటి రాష్ట్రాలలో బీజేపీ మరింత బలోపేతమైన విషయాన్ని
ప్రస్తావించారు. తెలంగాణలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ పార్టీ అధ్యక్షుడు
బండి సంజయ్ చేస్తున్న ప్రజాసంగ్రామ యాత్రను పార్టీ శ్రేణులకు వివరించారు. ఈ
యాత్రను అడ్డుకునేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నించినప్పటికీ వాటిని
ఎదుర్కొని ముందుకు వెళ్తున్న బండి సంజయ్‌ను ప్రధాని మోదీ స్వయంగా
అభినందించారు. సమావేశాల చివరి రోజున బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీ
కాలాన్ని పొడిగిస్తూ పార్టీ జాతీయ కార్యవర్గం నిర్ణయం తీసుకుంది. వచ్చే ఎడాది
జూన్ వరకు ఈ పదవి కాలం పొడిగించినట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా
వెల్లడించారు. మొత్తానికి రెండు రోజులపాటు జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశాలు
పార్టీ ప్రతినిధుల్లో ఫుల్ జోష్ నింపాయి. ఈ సమావేశాలకు దాదాపు 350 మంది
ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సమావేశాల్లో సామాజిక, ఆర్థిక, విదేశాంగ అంశాలపై
పలు తీర్మానాలను ఆమోదించారు.